నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఓ ఎంపీడీవో ఇంటిపై దాడి చేయడం.. రాష్ట్ర వ్యాప్త సంచలనం సృష్టించింది. మొదట ఆయనపై కేసు పెట్టడానికి కూడా భయపడిన పోలీసులు సాయంత్రానికి సీఎం సమీక్ష చేసి.. పర్మిషన్ ఇవ్వడంతో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అయితే.. ఇప్పుడు.. మెల్లగా అసలు విషయం బయట పడుతోంది. ఓ లేఔట్‌కు పర్మిషన్ విషయంలోనే ఈ గొడవ జరిగింది. ఆ లే ఔట్ .. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. కోటంరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. ఆ లేఔట్ ఉన్న మండల ఎంపీడీవో నెల్లూరు రూరల్ పరిధిలో నివసిస్తున్నారు. దీంతో.. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ.. తానే అనుమతులు ఇప్పించి… తన ప్రతిఫలం తాను పొందాలనుకున్న కోటంరెడ్డికి.. అక్కడి ఎమ్మెల్యే చెక్ పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా వైసీపీకి చెందిన వారే. కానీ.. తన నియోజకవర్గంలో.. కోటంరెడ్డి వేలు పెట్టడాన్ని ఆయన సహించలేకపోయారు.
ఎంపీడీవో పని చేస్తున్నది సర్వేపల్లి నియోజకవర్గంలో కాబట్టి అక్కడి ఎమ్మెల్యే మాటకే ఎక్కువ విలువ ఇచ్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి .. గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో…రియల్ ఎస్టేట్ లే ఔట్‌కు… ఎంపీడీవో పర్మిషన్ ఇవ్వలేదు. కావాలనే.. ఇవ్వడం లేదని ఆగ్రహించిన కోటంరెడ్డి.. తన పవర్ ను చూపించడానికి… ఎంపీడీవో ఇంటిపైకి వెళ్లారు. ఈ విషయంపై ఎంపీడీవోచాలా ఆలస్యంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీని వెనుక రాజకీయం ఉందని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన చెబుతున్న రాజకీయం చేస్తున్నది… సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డేనని… కోటంరెడ్డి అనుచరులు అంటున్నారు. కాకాణి ఒత్తిడి మేరకే.. ఎంపీడీవో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు.
నిజానికి వివాదానికి కారణమైన లేఔట్.. వైసీపీ నాయకుడిదే. అయినప్పటికీ.. అప్రకటిత లెక్కల ప్రకారం.. లేఔట్‌కి ఎంత మొత్తం చెల్లించాలో.. అంత మొత్తం.. ఎమ్మెల్యేకి చెల్లించాల్సిందేనన్న తాఖీదులు… ఆ వైసీపీ నేత కం రియల్ ఎస్టేట్ వ్యాపారికి వెళ్లాయి. ఆయన కోటంరెడ్డికి సన్నిహితుడు.. తాను చూసుకుంటానని చెప్పారు. కానీ.. కాకాణి మాత్రం ఒప్పుకోలేదు… తనది తనకు రావాల్సిందేనని పట్టుబట్టినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఎంపీడీవోను బెదిరిస్తే పనైపోతుందని భావించినట్లుగా తెలుస్తోంది. కానీ పని పూర్తి కాలేదు కానీ.. రచ్చ అయింది. వైసీపీ ఎమ్మెల్యేల వసూళ్ల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చిందంటున్నారు. మొత్తానికి వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ.. ఆ పార్టీలో జరుగుతున్న దందాను బయటకు తెచ్చిందంటున్నారు.