నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజవకర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డినే ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కలిసి అదాల ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. తర్వాత నియామక ప్రకటన విడుదల అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజక వర్గ శాసన సభ్యుడుగా పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అయితే అదాల.. నెల్లూరు రూరల్ అనే పేర్లు వినబడితే.. నెల్లూరు రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి 2019 నాటి ఎన్నికల పరిణామాలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో అధికార పార్టీ అయిన టీడీపీలో చేరి.. కాంట్రాక్టర్ గా పెద్ద ఎత్తున పనులు పొందారు. టీడీపీలో ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గానే ఉండేవారు. ఆయనకు 2019 ఎన్నికల్లో టిక్కెట్ కూడా ప్రకటించారు. అయితే కాంట్రాక్టర్ అయిన ఆయన… ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులను మంజూరు చేయించుకుని తర్వాత జెండా ఎత్తేసి..లోటస్ పాండ్లో కనిపించారు.
వెంటనే వైఎస్ఆర్సీపీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. నెల్లూరు రూరల్లో చివరి క్షణంలో అభ్యర్థిని ఖరారు చేసుకుని టీడీపీ పోరాడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ వైసీపీకి నెల్లూరు రూరల్ ఇంచార్జ్ గా ఆయననే పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంపీగా గెలిచిన ఆయన చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన కూడా వైసీపీ తీరుపై అసంతృప్తితో ఉన్నారని.. టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయినా ఆయనకే పదవి ఇవ్వడంతో.. ఇక ఆయనకు ఇవ్వాల్సిన బిల్లులు మాత్రం ఎన్నికలు అయిపోయే వరకూ పెండింగ్ పెట్టాల్సిందేనని జగన్ సర్కార్ కుసొంత పార్టీ నేతలు సలహాలివ్వడం ప్రారంభించారు.