రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వరదలతో అల్లకల్లోలం అయితే అలా హెలికాఫ్టర్లో ఓ రౌండ్ వేసి వచ్చిన సీఎం జగన్ తాడేపల్లి వచ్చి అదానీతో భేటీ అయ్యారు. ఈ భేటీ మొత్తం రహస్యంగా సాగింది. అధికారులు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏపీలో పెట్టుబడుల అంశం గురించి చర్చించడానికి వస్తే ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా భేటీ గురించి చెబుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అదానీ రాకపోకలు సహా అంతా గోప్యంగా ఉంచారు.
అదానీ తన సోదరులతో కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. అదానీ వచ్చింది పెట్టుబడుల గురించి కాదని వ్యాపార లావాదేవీల గురించి చర్చించడానికన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కానీ ఇతరులు కానీ ఈ సమావేశాల్లో పాల్గొనలేదని తెలుస్తోంది. ఏపీని అదానీకి అమ్మేస్తున్నారని ఇటీవలి కాలంలో విపక్షాలు ఆరోపిస్తున్నారు. సెకీతో విద్యుత్ ఒప్పందం, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు ఇలా అనేక అంశాల్లో అదానీ కేంద్ర, రాష్ట్రాల అధికారాలను ఉపయోగించుకుని టేకోవర్ చేసుకున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో జగన్తో భేటీకి అహ్మదాబాద్ నుంచి రావడం పారిశ్రామిక వర్గాలను సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాయలం కూడా ఈ భేటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే పూర్తిగా వ్యక్తిగతమేనని.. జగన్ వ్యాపార వ్యవహారాలపై చర్చించడానికే మాత్రమే వచ్చారని భావిస్తున్నారు.