తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో ఇరుక్కుపోయిన అదానీ పెట్టుబడుల ప్రతిపాదలను పూర్తి స్థాయిలో తగ్గిస్తోంది. ఇప్పటికే తాము గట్టిగా నిలబడాల్సిన రంగంలోనే అదనపు పెట్టుబడుల విషయంలో కిందా మీదా పడుతోంది. కానీ ఏపీలో మాత్రం అదనపు పెట్టుబడులు పెడుతుందని ప్రభుత్వం చెబుతోంది. విశాఖలో అదానీ డేటాసెంటర్ సైజ్ పూర్తిగా తగ్గిపోయింది. 2020లో చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని .. స్సవయంగా అదానీ వచ్చి శంకుస్తాపన కూడా చేశారు. అప్పుడుపెట్టాలనుకున్న పెట్టుబడి రూ. 70 వేల కోట్లు. ఈ మేరకు ఎంవోయూ చేసుకుంది. తాజాగా వచ్చే నెలలో డేటా సెంటర్ కు మరోసారి శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కానీ పెట్టే పెట్టుబడి రూ. 7వేల కోట్లు. అంటే తొంభై శాతంపెట్టుబడి తగ్గించుకున్నారన్నమాట. పోనీ ఈ పెట్టుబడినైనా వెంటనే పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తారా అంటే అదీ లేదు.. ఏకంగా ఏడేళ్లు సమయం ఇచ్చారు. ఆ లోపు పూర్తి చేయాలట. ఇప్పటికే అదానీకే అత్యంత ఖరీదైన కొండను కట్టబెట్టారు. సేల్ డీడ్ కూడా చేశారు. అయినా పెట్టుబడి ప్రతిపాదనలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏపీకి ఒక్క పరిశ్రమ తీసుకు రాలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ వరుసగా శంకుస్థాపనలు చేసుకుంటున్నారు. ఐదేళ్ల కిందట వచ్చిన ఎంవోయూలు ఫాలో అప్ చేసుకోలేక.. చివరికి అతి తక్కువ పెట్టుబడికి ఒప్పించి మ మ అనిస్తున్నారు. అదానీ గ్రూప్ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి.. ఆ పెట్టుబడి అయినా పెడుతుందో లేదో చెప్పడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ప్రభుత్వం మాత్రం ఇది అదనపు పెట్టుబడి అని చెబుతోంది. మరి పాత పెట్టుబడి పెట్టేశారా.. పెడతారా అంటే మాత్రం సమాధానం ఉండటం లేదు.
అదానీకి ఏపీలో ఎన్ని ఆస్తులు రాసిచ్చారో చెప్పడం కష్టం. అత్యంత కీలకమైన గంగవరం, కృష్ణపట్నం పోర్టులు అదానీ పరం అయ్యాయి. ఇటీవల హిండెన్ బర్గ్ రిపోర్టుతో బాగా దెబ్బతిన్నారు కానీ లేకపోతే.. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లు కూడా కట్టబెట్టేయాలని చివరి వరకూ ప్రయత్నాలు జరిగినట్లుగా చెప్పుకున్నారు. అలాంటి అదానీ కూడా పెట్టుబడుల విషయంలో కిందామీదా పడుతుంది.ఇక వేరే కంపెనీలు మాత్రం ఏం పెట్టుబడులు ఏపీలో పెడతాయి ?