అదానీ కొనాలనుకుంటే.. ఎయిర్ పోర్టులు.. పోర్టులను వదిలి పెట్టడం లేదు. మరి టీవీ చానళ్లు ఓ లెక్క. చాలా కాలం మీడియాను పట్టించుకోని అదానీ ఇటీవలే మీడియాపై కన్నేశారు. కొంత కసరత్తు తర్వాత ఎన్డీటీవీలో మెజార్టీ వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసినట్లుగా ప్రముఖ బిజినెస్ పోర్టల్ మనీ కంట్రోల్ ప్రకటించింది. నిజానికి ఈ అంశంపై కొంతకాలంగా ఊహాగానాలు జరుగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఎన్డీటీవీ అదానీ చేతికి వెళ్లబోతోందని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత ఏడాది సెప్టెంబర్‌లోనే లండన్‌లో రూ.1600 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకాలు జరిగాయని చెప్పుకున్నారు. అయితే అప్పట్లో అదానీ గ్రూప్ ఖండించింది. కానీ ఇప్పుడు నిజం అయింది. మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆదానీ గ్రూప్ ఓ కంపెనీని ఏర్పాటు చేసి.. వెటరన్ జర్నలిస్టు సంజయ్ పుగాలియాను సీఈవో, ఎడిటర్ ఇన్ చీఫ్‌గా నియమించుకున్నది. అప్పట్నుంచి అదానీ మీడియా కదలికలు పెరిగాయి. ఇక ఎన్డీటీవీ ఆర్థిక లావాదేవీలు ఒడిదొడుకులకు గురవుతున్నాయి.
ఎన్డీటీవీ ప్రమోటర్లు పన్ను ఎగవేత కేసులను ఎదుర్కొంటున్నారు. ఎన్డీటీవీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.375 కోట్ల మేరకు తీసుకున్న రుణంలో బ్యాంకుకు రూ.46 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ కేసు దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో అన్నింటి నుంచి బయటపడటానికి కంపెనీని అదానీ చేతుల్లో పెట్టడమే మంచిదని డిసైడయినట్లుగా కనిపిస్తోది. మొత్తంగా ఇప్పుడు రిలయన్స్ న్యూస్ 18 మీడియా రంగంలో కింగ్‌గా ఉండగా అదానీ పోటీకి వస్తున్నారు.