అదానీ గ్రూప్ రాను రాను మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోతోంది. బుధవారం మరోసారి దారుణ పతనం చూసింది. ఆ గ్రూప్ కంపెనీలన్నీ పతనం బాట పట్టాయి. లిస్టెడ్ కంపెనీల్లో ఒక్కటి కూడా కాస్తంత కూడా రికవర్ కాలేదు. బుధవారం ఒక్క రోజే మరో రూ. యాభై ఒక్క వేల కోట్ల నష్టం అదానీ షేర్స్ కొన్న మదుపర్లకు జరిగింది. ఇప్పటి వరకూ ఇలా పెట్టుబడిదారులు రూ. పదకొండు లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. అదానీ గ్రీన్, అదానీ పవర్ వంటి కంపెనీలు ఇక కోలుకుంటాయా లేదా అన్నంతగా తేలిపోతున్నాయి.
రెండు, మూడు నెలల క్రితం నాలుగు వేల వరకూ ఉన్న షేర్ ధర ఇప్పుడు మూడు, నాలుగు వందల దగ్గర కదలాడుతోంది. మరో వైపు ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఎంత మద్దతు లభిస్తున్నా… కంపెనీపై మదుపుదార్లు మరోసారి ఆసక్తి చూపించడం లేదు. కొంచెం షేర్ ధర పెరిగితే అమ్ముకుందామని చూసేవారే ఎక్కువ గా ఉన్నారు. రుణాలు తిరిగి చెల్లిస్తామని చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. మరో వైపు ఆ సంస్థ ఉన్న రుణాలపై సెబీ విచారణ ప్రారంభించింది.
మరో వైపు అదానీ షేర్లు కొనుక్కున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా కొంటామని.. పెట్టుబడులు పెడతామని ప్రకటిస్తూ.. మదుపుదార్ల సెంటిమెంట్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. అవేమీ ఉపయోగపడటం లేదు. అదానీ రుణాల తిరిగి చెల్లింపుల్లో .. ఇప్పటి వరకూ ప్రకటించిన పెట్టుబడుల ప్రణాళికాల్లో వెనుకబడితే.. మరింతగా ఇరుక్కుపోతారు. ఇప్పటికే అదానీని నమ్ముకున్న ఇన్వెస్టర్లు నట్టేట మునిగారు. అయినా నియంత్రణ సంస్థలు పట్టించుకోక పోతూండటంతో సమస్య ఏర్పడుతోంది.