విశాఖలో నాలుగున్నరేళ్ల తర్వాత రెండో సారి డేటా సెంటర్ కు అదానీ గ్రూప్ శంకుస్థాపన చేసింది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన జరిగింది. టీడీపీ హయాంలో చేసిన శంకుస్థాపనకు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరయ్యారు. కానీ ఈ సారి మాత్రం ఆయన రాలేదు. ఇద్దరు కుమారుల్ని పంపించారు. ఉదయం వరకూ గౌతమ్ అదానీ వస్తారన్న ప్రచారం చేశారు. కానీ ఆయన మాత్రం రాలేదు.
అదానీ గ్రూప్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లలో ఉంది. హిండెన్ బెర్గ్ రిపోర్ట్ తర్వాత కొత్త పెట్టుబడులపై పూర్తి స్థాయిలో పునరాలోచన పడింది. అత్యంత ప్రయారిటీగా పునరుత్పాదక విద్యుత్ పై పెట్టుబడులు పెడుతోంది. డేటా సెంటర్లపై పెట్టుబడులపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ విశాఖలో మాత్రం డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు. అత్యంత విలువైన ఓ కొండను అసలు పనులు ప్రారంభించక ముందే అదానీకి సేల్ డీడ్ చేశారు. వారు ఆ కొండను తనఖా పెట్టి రుణాలు తెచ్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మరో వైపు డేటా సెంటర్ విషయంలో ప్రభుత్వ ప్రచారం ఓ రేంజ్ లో ఉంది. ఈ డేటా సెంటర్ కు శంకుస్థాపనచేసిన సీఎం జగన్ డేటా డౌన్లోడ్, అప్లోడ్ శరవేగంగా జరుగుతాయని ప్రకటించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, వినియోగం, ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరుగుతుందన్నారు. 39 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పుకొచ్చారు.
శంకుస్థాపన విషయంలో జగన్ కొబ్బరికాయ కొట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సమయంలో కొబ్బరికాయ కొట్టాడనికి వంగోలేకపోయిన జగన్ .. పూజారి రాయి ఎత్తి పట్టుకోవడంతో కొబ్బరికాయ కొట్టారు. ఈ సారి అలా వంగే అవసరం లేకుండా క్రికెట్లో వికెట్ల తరహాలో ఓ కొబ్బరికాయ కొట్టే పరికరాన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో జగన్ వంగకుండానే కొబ్బరికాయ కొట్టేశారు.