గౌతమ్ అదానీకి కానీ ఆయన భార్య ప్రీతి అదానీ కానీ ఎలాంటి రాజకీయ పార్టీల్లో చేరబోవడం లేదని వారికి రాజకీయ ఆసక్తి లేదని అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఇద్దరిలో ఒకరు రాజ్యసభకు వెళ్లబోతున్నారన్న ప్రచారం జరుగుతోందని అది అవాస్తవమని ప్రకటించారు. అదానీ కుటుంబం నుంచి ఒకరిని రాజ్యసభ కు పంపేందుకు వైఎస్ఆర్సీపీ తరపున జగన్ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరిగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో ప్రచారం ఉద్ధృతం అయింది. అయితే హఠాత్తుగా అదానీ గ్రూప్ నుంచే వివరణ వచ్చింది.
దీంతో ఏపీ నుంచి అదానీ కోటాలో ఎవరికీ రాజ్యసభ ఇవ్వడం లేదని భావిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో చేరే ఉద్దేశం లేదని అదానీ గ్రూప్ ఇచ్చిన ప్రకటనలో ఉంది. గతంలో రిలయన్స్ తరపున సీటు పొందిన పరిమళ్ నత్వానీ కి కూడా వైసీపీ అగ్రనేతలు పార్టీలో చేరాలని షరతు పెట్టారు. దానికి ఆయన అంగీకరించారు. గుజరాత్‌కు చెందిన ఆయన ఏపీలో వైసీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ తరపున నామినేషన్ వేసి.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇదే తరహాలో అదానీ అయినా ఆయన భార్య అయినా వైసీపీలో చేరాల్సి వస్తుందనే వెనుకడుగు వేసినట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా వైసీపీ బీజేపీ మద్దతుదారులయిన కార్పొరేట్లకు దాసోహం అయిపోయిందనే పేరు అదానీకి రాజ్యసభ సీటు ఇస్తే వచ్చేది. ఇప్పుడు అదానీనే వెనక్కి తగ్గింది. బీజేపీ కోటాలో ఎవరికైనా ఇస్తారా లేకపోతే.. సొంత పార్టీ నేతలకే ప్రాధాన్యం ఇస్తారా అన్నది రెండు, మూడు రోజుల్లో తేలనుంది.