రూ.70 వేల కోట్ల పెట్టుబడి..! లక్ష ఉద్యోగాలు..! .. ఈ ఏడాది జనవరిలో ఆదాని గ్రూప్ విశాఖలో 5 గిగావాట్ సమర్థ్యంతో రానున్న డేటా సెంటర్ పెట్టడానికి ఏపీ సర్కార్‌తో చేసుకున్న ఎంవోయూలో ప్రధాన అంశాలు. ప్రభుత్వం భూములు కేటాయించింది. కాపులుప్పాడ ఐటీ పార్క్ వద్ద ఫిబ్రవరి 14వ తేదీన భూమి పూజ కూడా జరిగింది. అదాని గ్రూప్‌తో ఒప్పందం జరిగిన సరిగ్గా నెలరోజుల్లోనే డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఆ తర్వాత ఎన్నికలొచ్చాయి. టీడీపీ సర్కార్ … పోయి.. వైసీపీ సర్కార్ పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్టులో కదలిక లేదు. అదానీ గ్రూప్.. నిర్మాణాలు నిలిపివేసింది. ప్రాజెక్టులో పురోగతి లేదు.
హఠాత్తుగా ఆదాని గ్రూప్.. హైదరాబాద్‌లో 13 బిలియన్ డాలర్ల వ్యయంతో డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ కోసం శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ రియాల్టీతో జత కడుతున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, డిజిటల్ రియాల్టీ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ విషయం బయటకు తెలియగానే.. ఒక్క సారిగా.. రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేగింది. విశాఖలో పెట్టాలనుకుంటున్న డేటా సెంటర్‌నే.. ఆదాని గ్రూప్ హైదరాబాద్‌కు తరలించిందా.. అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. దీనిపై… ఆదాని గ్రూప్ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. విశాఖలో పెట్టాలనుకున్న సెంటర్‌నే హైదరాబాద్‌లో పెడుతున్నామని చెప్పలేదు.
అయితే… విశాఖలో రూ. 70వేల కోట్లు… హైదరాబాద్‌లో మరో రూ. 90వేల కోట్లు పెట్టుబడులు పెట్టి డేటా సెంటర్లను ఆదాని గ్రూప్ ఏర్పాటు చేయడం అసాధ్యం. ఏదో ఒక్క చోట మాత్రమే.. ఇలాంటి సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. అంటే.. ఓ చోట డ్రాప్ అయి.. మరో చోట ప్రారంభిస్తున్నట్లుగా భావించాలన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. ఈ అంశంపై..ఏపీ ప్రభుత్వం కానీ.. ఆదానీ కానీ స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. లేకపోతే ఇది రాను రాను..రాజకీయ దుమారంగా రేగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే.. వివిధ సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు.. భూ కేటాయింపులను.. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రద్దు చేస్తోంది. దీనికి ఆదాని కూడా చేరిందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.