అదానీ కంపెనీ బొగ్గు అమ్ముకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. బొగ్గు కొరత తీవ్రంగా ఉండబోతోందని ముందస్తుగా విదేశాల నుంచి కొనుగోలు చేసుకోవాలని కేంద్రం కూడా సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం బొగ్గు కొనుగోలుకు టెండర్లు పిలిచింది. సహజంగానే బొగ్గు ఇస్తామంటూ అదానీ కంపెనీ వచ్చింది. అదానీకి ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు ఉన్నాయి. చాలా రాష్ట్రాలకు భారీ రేటుతో సరఫరా చేస్తోంది కూడా. అంత కంటే భారీ రేటుతో ఏపీ పిలిచిన టెండర్లకు స్పందించింది. కానీ టెండర్ల ఖరారుకు ముందే డ్రాపయినట్లుగా తెలుస్తోంది.
అదానీ ఏపీకి బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టుల నుంచి వైదొలిగినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకు అనే దానిపై స్పష్టత లేదు. భారీ రేటు ఆఫర్ చేస్తున్నప్పటికీ అదానీ వైదొలగడం.. రాజకీయవర్గాలతో పాటు వ్యాపార వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే ఏపీ విద్యుత్ సంస్థలు డబ్బులు చెల్లించవేమో అన్న సందిగ్ధంతోనే వెనక్కి తగ్గారన్న వాదన వినిపిస్తోంది. విద్యుత్ సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. విద్యుత్ ఒప్పందాలకు కూడా చెల్లించడం లేదు. వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో అదానీ డ్రాప్ అయినట్లుగా తెలుస్తోంది.
ముందు ముందు కరెంట్ కు డిమాండ్ పెరిగితే… ధర్మల్ విద్యుత్ మీదే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ విషయంలో ఏపీ సర్కార్ మొదట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. గతంలో ఉన్న ఒప్పందాలను గౌరవించకపోవడం.. కొత్తగా కొన్ని సంస్థలకు చాన్సు ఇవ్వడం.. అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడు బొగ్గు విషయంలో ఇతర కంపెనీలు కూడా వెనక్కి తగ్గితే ఏపీ చీకట్లలో మగ్గిపోవాల్సి ఉంటుంది.