గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచ బిలియనీర్లలో ఒకరు. అంబానీని కూడా దాటిపోయారు. రిలయన్స్ సామ్రాజ్యం కిందిస్థాయి నుంచి ఎదిగింది. ముఖేష్ అంబానీకి బిలియనీర్ల కేటగిరిలో చోటు దక్కడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ మరి అదానీ .. అంబానీని మించి బిలియనీర్ కేటగిరిలోకి ఎలా వెళ్లాడు..? అదే షేర్ మార్కెట్ మాయాజాలం. అదానీ ఇటీవలి కాలంలో ఎడాపెడా పోర్టుల్ని.. ఎయిర్ పోర్టుల్ని కొనేస్తున్నారు. అంత డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని చాలా మందికి సందేహం. ఆ డబ్బులు పోటీ పడి అదానీకి బ్యాంకులు, ఎల్ఐసీ డబ్బులు పంపిణీ చేస్తున్నాయి.
హిన్ డెన్ బెర్గ్ రీసెర్చ్ బయట పెట్టిన సంచలన విషయాలతో అదానీ వ్యాపార సామ్రాజ్యం పేక మేడ అని తేలిపోయింది. దీనికి అదానీ గ్రూప్ స్పందించినా.. అవన్నీ అవాస్తవాలు అని చెప్పింది కానీ.. నిజాలేంటో చెప్పలేదు. ఇప్పుడు అదానీ షేర్లు స్టాక్ మార్కెట్లలో తగ్గుతున్నాయి. ఒక వేళ కంపెనీలు నట్టేట మునిగిపోతే ఇండియా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. గౌతమ్ అదానీ గ్రూప్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇప్పటికే రూ. లక్ష కోట్ల వరకూ పెట్టుబడిపెట్టింది. బ్యాంకులు అంతకు మించి అప్పులు ఇచ్చి ఉంటాయి.
ట్రేడింగ్ కంపెనీగా నడిచే అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఎనిమిదేళ్ల కాలంలోనే ఎదిగింది. రేవులు, విమానాశ్రాయాలు, విద్యుత్ ప్రాజెక్టుల్ని వరుసపెట్టి టేకోవర్ చేస్తూ ఏడు లిస్టెడ్ కంపెనీలుగా విస్తరించింది. వాటి షేర్లు పరుగులు పెడుతున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాటి పోటీ వ్యాపార కంపెనీలతో పోలిస్తే అత్యధిక విలువపై ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు విద్యుదుత్పాక సంస్థ అదానీ గ్రీన్ లాభంతో పోలిస్తే షేరు ధర 1,109 రెట్లు ఉంది. అదానీ గ్రూప్ షేరు విలువలను వాటి ఫండమెంటల్స్ రీత్యా అనూహ్యమైనవని, కొనదగ్గవి కాదని ఫండ్ మేనేజర్లు చెబుతూంటారు.
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అదానీ గ్రూప్ అనేక వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడులు పెట్టడంపై ఒక రిపోర్ట్ అందించింది. ఇది కంపెనీపై రుణాల భారాన్ని పెంచుతోందని అభిప్రాయపడింది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అదానీ గ్రూప్ అప్పుల ఊబిలో కూరుకుపోయి డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని క్రెడిట్‌సైట్స్ అప్పట్లో తన నివేదికలో పేర్కొంది. అదే జరిగితే ముందుగా నష్టపోయేది.. ఎల్ఐసీనే.. బ్యాంకులే. అదానీ గ్రూప్ సామ్రాజ్యం అంతా ఉత్పత్తి, లాభాల మీద కాకుండా కేవలం..షేర్ల మీద పెరుగుతోంది. అవకతవకలు బయటపడిన రోజున కుప్పకూలిపోతుంది.