విమాశ్రయాలు కట్టడంలో తెలుగు దిగ్గజాలు ఆరితేరిపోయారు. కానీ వారికి రాజకీయ చాణక్యం కానీ.. కొత్త తరం బిజినెస్ కానీ తెలియక ఓడిపోయారు. వాళ్లే జీవీకే.. జీఎంఆర్. దేశంలో కొత్త తరం విమానాశ్రయాల అభివృద్ధిలో వీరి పాత్ర మామూలుది కాదు. కానీ ఇప్పుడు వీరు విమాశ్రయాలను వేరేరే వారికి అప్పగించాల్సి వస్తోంది. తాజాగా జీవీకే అభివృద్ధి చేసిన ముంబై విమానాశ్రయం… అదానీకి అప్పగించాల్సి వచ్చింది. ప్రపంచస్థాయి ఎయిర్ పోర్టు అదానీ గ్రూపు చేతికి రావడం ఆనందంగా ఉందని అదానీ సంతోషంగా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ వెనుక ఏడాది కథ ఉంది. గత ఏడాది జూలైలో దీనికి సంబంధించి మొదటి అడుగు పడింది.
దేశంలో పోర్టులు.. ఎయిర్‌పోర్టులపై ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్న అదానీ.. ముంబై ఎయిర్‌పోర్టుపై కన్నేశారు. అమ్మేయాలని జీవీకే సంస్థతో బేరం పెట్టారు. వారు అంగీకరించలేదు. దాంతో గత ఏడాది జూలైలో ప్లాన్ అమలు కావడం ప్రారంభమయింది. ముంబై విమానాశ్రయం నిర్మాణం, నిర్వహణ విషయాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ.. జీవీకే గ్రూప్‌పై గత ఏడాది జూలైలో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఉద్ధృతంగా సోదాలు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్న జీవీకే కుటుంబానికి ఆర్థిక అవకతవకల విషయంలో ఎప్పుడూ చెడ్డపేరు లేదు. బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టారన్న ఆరోపణలు కూడా లేవు. కానీ సీబీఐ, ఈడీ మాత్రం చాలా కారణాలు చెప్పి.. సోదాలు చేసింది. విస్తృతంగా మీడియాకు లీక్ చేసి.. వారిపై తప్పుడు అభిప్రాయం కల్పించేలా చేసింది. ఆ ఫలితం ఏడాదిలోనే కనిపించింది. ముంబై విమానాశ్రయాన్ని అదానీకి జీవీకే గ్రూప్ అమ్మేసింది.
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లో అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ వచ్చే వారంలోగా జీవీకే గ్రూప్ నుంచి 50.5 శాతం వాటాను కొనుగోలు చేసేసింది. జీవీకేకు అమ్ముకోవాలని లేకపోయినా… సీబీఐ, ఈడీ దాడుల వల్ల అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అమ్మకపోతే.. ఇంకెంత దారుణంగా పరిస్థితి ఉటుందో.. ట్రైలర్ చూపించారు మరి. జీవీకేనే సెట్ చేసుకున్న తర్వాత ఇక మైనార్టీ పార్టనర్లను పట్టుకోవడం ఎంత సేపు. వారి వద్ద ున్న మరో 23.5 శాతం వాటాను గౌతమ్ అదానీకి చెందిన ఏఈఎల్ కొనుగోలు చేసేసింది. జీవీకే అమ్మేశారు కాబట్టి.. గతంలో ఆయనపై సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు.. చేసిన సోదాలు అన్నీ తూచ్ అని తేలిపోయాయన్నమాట.
ఇప్పటికే అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి వంటి ఆరు విమానాశ్రయాలను అదానీకి కేంద్రం అప్పగించింది. యాఙై ఏళ్ల పాటు అదానీ చేతిలోనే ఈ ఎయిర్‌పోర్టులు ఉంటాయి. దేశీయ ఎయిర్ పోర్టు రంగంలో అదానీ గ్రూప్ వాటా 25శాతానికి చేరింది. దేశంలో అతిపెద్ద ఎయిర్ పోర్టు సంస్థగా అవతరించింది. నిర్మించిన వారు పక్కపోతున్నారు… విదేశాల నుంచి లెక్కలేని పెట్టుబడులు తెచ్చి కొనేవారు అసలు ఓనర్లవుతున్నారు. ఇదే కొత్త వ్యాపారం..!