ఎన్డీటీవీ గ్రూప్‌లో అదానీ మెజార్టీ వాటాను కొనుగోలు చేయడంపై దేశ వ్యాపార రంగంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ మీడియాకు పాకిందన్న విషయం కాకుండా.. అసలు ఆ టేకోవర్ ఎలా సాధ్యమయిందన్న అంశంపై ఈ చర్చలు సాగుతున్నాయి. అదానీ గ్రూప్ నుంచి.. తాము ఎన్డీటీవీలో మెజార్టీ వాటాలను రెండు విధాలుగా సమకూర్చుకుంటున్నామని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఎన్డీటీవీ గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన లేదు. తమ గ్రూప్‌ను అదానీ కొంటున్నారని ఆ సంస్థ ఎక్కడా చెప్పలేదు.పైగా వారు అంతర్జాతీయ మీడియా సంస్థలకు .. అసలు అదానీ గ్రూప్ అలాంటి ప్రకటన ఎలా ఇచ్చిందో తెలియడం లేదంటున్నారు.
ఎన్డీటీవీలో మెజార్టీ వాటాలను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్.. ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ.. ఎన్డీటీవీ ఫౌండర్స్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆ టీవీచానల్ వర్గాలు స్పష్టంగా ఇంతర్జాతీయ మీడియాకు తెలిపాయి. రాయిటర్స్, బీబీసీ వంటివి ఈ విషయాన్ని అంతర్జాతీయంగా ప్రముఖంగా ప్రచురించాయి. అదానీ వ్యాపార సామ్రాజ్యం..ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ఉంది. అక్కడ ఆయనకు ఉన్న బొగ్గు గనులపై వివాదాలున్నాయి. ఈ క్రమంలో ఎన్డీటీవీ ఫౌండర్లు చేసిన వ్యాఖ్యలు సహజంగానే చర్చనీయాంశమవుతున్నాయి.
ఎన్డీటీవీ ఫౌండర్లు.. అదానీ గ్రూప్ తమ సంస్థను టేకోవర్ చేస్తోందన్న సమాచారం తమకు లేదని చెబుతున్నారు. అయితే మార్కెట్ వ్యవహారాలపై వారికి అవగాహన ఉండదని చెప్పలేం. తమ కంపెనీపై అదానీ కన్నేశారని వారికి తెలియకుండా ఉండదు. కానీ తమ కంపెనీ అదానీ చేతుల్లోకి వెళ్లడం ఇష్టం లేదని.. అందుకే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారన్న భావన వ్యక్తమవుతోంది. దేశంలో అన్ని న్యూస్ మీడియా సంస్థలు.. బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయి. అయితే అతి కొద్ది మాత్రం కేంద్రం లోపాలను ఎత్తి చూపుతున్నాయి. వాటిలో ఎన్డీటీవీ కూడా ఒకటి. అందుకే ఎన్డీటీవీని అదానీని బలవంతంగా టేకోవర్ చేస్తూండటం చర్చనీయాంశమవుతోంది.