గౌతమ్ అదానీ ప్రపంచ కుబేర జాబితాలో చోటు కోసం ఫ్రంట్ రన్నగా మారిపోయారు. గత ఏడాదిగా ఆయన సంపాదన.. ప్రపంచ రవాణా రంగానికి ఎలక్ట్రానిక్ అడుగులు నేర్పి… ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్న స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్‌తో పాటు… ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సేవలు పొందని వ్యక్తులు అతి తక్కువగా ఉండేలా…వ్యాపార వ్యవస్థను తీర్చిదిద్దిన జెఫ్ బెజోస్ కన్నా ఎక్కుగా అదానీ సంపాదన నమోదయింది. ఆయన సంపాదన ఒక్క ఏడాదిలో 34 బిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. అంత పెద్ద ముఖేష్ అంబానీ సంపద ఒక్క ఏడాదిలో పెరిగింది ఎనిమిది బిలియన్ డాలర్లు మాత్రమే.
ఇంతకీ గౌతమ్ అదానీ ఏ బిజినెస్‌లు చేసి డబ్బు సంపాదిస్తున్నారబ్బా అనే సందేహం చాలా మంది సామాన్యులకు ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రపంచ కుబేరులయిన వారిని చూస్తే.. సామాన్య జన జీవనానికి అవసరమయ్యే వస్తువులో.. సేవలో అందించే కంపెనీలను స్థాపించి… పై స్థాయికి తీసుకెళ్లిన వారే కనిపిస్తారు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కావొచ్చు… అమెజాన్ బెజోస్ కావొచ్చు.. రిలయన్స్ అంబానీ కావొచ్చు.. జపాన్ కుబేరులు కావొచ్చు.. ఎవరైనా… వారి కంపెనీలు.. ప్రపంచ ప్రజలకు చిరపరిచితమైనవి ఉంటాయి. అయితే.. ఇండియాలో ధనవంతుడిగా ఎదిగిపోతున్న అదానీ కంపెనీలు.. ఏ ఉత్పత్తులు చేస్తాయో చాలా మందికి తెలియదు.
అదానీకి పోర్టులు, ఎయిర్ పోర్టులు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమయ్యాయి.. ఎంతెంత లాభాలు ఆర్జిస్తున్నాయి అన్నదానిపై.. కార్పొరేట్ వర్గాల్లోనే అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మరి ఇంత సంపద ఆయనకు ఎలా పెరిగిందంటే… షేర్ మార్కెట్ వల్ల. ఆయనకు చెందిన సంస్థలు.. షేర్ మార్కెట్లో పెద్దగా లాభనష్టాలతో సంబంధం లేకుండా.. విపరీతంగా విలువ పెరిగిపోయాయి. అదానీ టోటల్ గ్యాస్ అనేకంపెనీ షేర్లు 96శాతం పెరిగాయి. ఇతర కంపెనీల షేర్లు 52 శాతం వరకూ పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ గత ఏడాది ఐదు వందల శాతం పెరిగింది.
అదానీ పేరు ఏపీలోనూ మారుమోగుతోంది. కృష్ణపట్నం పోర్టును అదానీ కైవసం చేసుకుంది. భావనపాడు పోర్టును కూడా.. కట్టాలని ఒప్పందం చేసుకుంది. ఇటీవల పలు ఎయిర్ పోర్టులను కేంద్రం నుంచి లీజుకు తీసుకుంది. కొన్ని రైల్వే లైన్లు కూడా… సొంతం చేసుకుంది. అలా చెప్పుకుంటూ పోతే.. ప్రభుత్వ రంగం నుంచి అనేకానేకం అదానీ పరం అవుతున్నాయి. ఆయన కంపెనీల షేర్లు పెరిగిపోతున్నాయి.ఆయన కుబేరుడయిపోతున్నారు.కొన్నాళ్లు పోతే… దేశంలో రిచ్చెస్ట్.. అంబానీ కాకుండా అదానీ అయ్యే అవకాశం ఉంది.