మైనింగ్, పోర్టులు, ఎయిర్ పోర్టులను టేకోవర్లు చేసేస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు మీడియాపై దృష్టి పెట్టింది. మీడియాలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం మీడియా రంగంలో ప్రసిద్ధుడైన .., ప్రస్తుతం ద క్వింట్ గ్రూప్‌లో ఉన్న సంజయ్ పుగాలియాను ఎడిటర్ ఇన్ చీఫ్‌గా నియమించుకుంది. ఇలా నియామకం జరగిన మూడు నాలుగు రోజుల్లోనే ఓ ఇంగ్లిష్, హిందీ భాషల్లో సుప్రసిద్ధ చానల్‌ను ఆయన టేకోవర్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
దేశంలో బీజేపీ, అదానీ తమకు వ్యతిరేకంగా భావించే చానల్ అది. ఆ మీడియా గ్రూప్‌పై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. మనీలాండరింగ్‌తో అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం లాంటి కేసులు కూడా ఉన్నాయి. ఆ చానల్‌పై దృష్టి పెట్టిన అదానీ కేసుల నుంచి విముక్తితో పాటు పెద్ద మొత్తంలో నగదును ఆఫర్ చేసి ఆ చానల్‌ను కొనుగోలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రూ. పదహారు వందల కోట్లకు డీల్ జరిగిపోయిందని.. లండన్‌లో ఈ ఒప్పందానికి సంబంధించి పత్రాలపై సంతకాలు జరగబోతున్నాయని చెబుతున్నారు.
అదానీ గ్రూప్ పెట్టుబడుల వ్యవహారంపై ఇప్పటికే దుమారం ఉంది. ఆయనకు పెట్టుబడులకు కావాల్సిన నగదు ఎక్కడి నుంచి వస్తుందన్నదానిపై స్పష్టత లేదు. విదేశీ కంపెనీల నుంచి వస్తున్న పెట్టుబడులకు లెక్కలు లేవని.. ఆ కంపెనీలకు ఆడ్రస్‌లు కూడా లేవన్న ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. అయితే అదానీ మాత్రం పెట్టుబడులు పెడుతూ పోతున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటి వరకూ ఏ ఒక్క సంస్థనీ కింద నుంచి పెంచింది లేదు. ఎవరో పెంచిన వారిని కొనుగోలు చేయడమే చేస్తూ వస్తోంది. మీడియాలోనూ అదే చేయబోతోంది.