అదానీ గ్రూపు సంసస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో ఆ సంస్థ సంక్షోభంలో చిక్కుకుపోయింది. దీంతో ఎంతో ఉద్దృతంగా పెట్టాలనుకున్న పెట్టుబడుల పరిస్థితి అనుమానంగా మారింది. ఈ ప్రభావం ఎపీపై ఎక్కువే పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో వివిధ ప్రాంతాల్లో 3,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ముందుకొచ్చింది. నాలుగు దశల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లకు 15,376 కోట్ల రూపాయలను ఆ సంస్థ ఖర్చు చేయాల్సిఉంది. దీనికోసం 11,000 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇచ్చిన అనుమతుల ప్రకారం 2022-23లోనే ఆ సంస్థ 1,349 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిఉంది. అయితే ఇప్పటి వరకు ఒక శాతం కూడా ఖర్చు చేయలేదు.
ఇప్పుడు ఆ సంస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో 2023-24 సంవత్సరంలో ఖర్చు చేయతలపెట్టిన 10వేల కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయాన్ని సమీక్షించాలని ఆ సంస్థ నిర్ణయించింది. అందులో ఏపీ కూడా ఉంటుంది. ఇక డేటా సెంటర్ల పేరుతో ఇచ్చిన భూముల్లో చేయాల్సిన శంకుస్థాపన కూడా ఆగిపోయింది. 130 ఎకరాలను ‘అదానీ గ్రూప్ డేటా ఎనలటిక్స్ సెంటర్ (డిఎసి)’ కోసం కేటాయించింది. రూ.4 వేల కోట్లకు పైగా విలువ ఉన్న స్థలాన్ని కేవలం రూ.130 కోట్లుకే అదానీ డేటా సెంటర్ కోసం జగన్ ప్రభుత్వం ఇచ్చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మరో అరవై ఎకరాలను కేటాయించారు. ఇంకా కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పెట్టుబడులు పెట్టకపోతే మాత్రం ఇదో పెద్ద స్కామ్ గా విపక్షాలు ఆరోపిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డేటా సెంటర్ కు అదానీ గ్రూప్ పెట్టుబడులు సమకూర్చడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా చేయాల్సిన శంకుస్థాపన కూడా ఆపేసినట్లుగా తెలుస్తోంది.
అటు పరిశ్రమలు రాక, ఇటు భూములు సాగు లేని ప్రమాదం ఏర్పడుతుంది. అదానీ గ్రూపు ఇప్పటికే కృష్ణపట్నం , గంగవరం పోర్టులను సొంతం చేసుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆ కంపెనీకే ఇవ్వబోతున్నారని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఎలా చూసినా అదానీ గ్రూప్ సంక్షోభం ఏపీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో అదానీ గ్రూప్ తరపున గౌతమ్ అదానీ పాల్గొంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.