సైన్స్ ఫిక్షన్ కథలు భలే ఉంటాయి. ఇలా జరుగుతుందా? అనిపిస్తూ, జరిగితే బాగుణ్ణు అని ప్రేరేపిస్తూ.. కావల్సినంత టైమ్ పాస్ కలిగిస్తాయి. అందులోనే థ్రిల్.. అందులోనే ఫన్. కాబట్టి.. సెన్స్ ఫిక్షన్లు దాదాపుగా వర్కవుట్ అయిపోయే ఫార్ములా కింద మారిపోయింది. అయితే ఫిక్షన్ కథల్లో కాస్త రిస్క్ ఉంది. `ఇలా జరిగితే బాగుణ్ణు` అనిపించకుండా, `ఇలా ఎందుకు జరుగుతుందిలే` అనుకుంటే… మాత్రం మొదటికే మోసం వస్తుంది. `అద్భుతం` అనే కథలోనూ ఈ రిస్క్ ఉంది. ఒకే ఫోన్ నెంబర్ ఇద్దరికి ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. అసలు ఆ థాటే.. కొత్తగా అనిపిస్తుంది. దాన్ని సైన్స్ ఫిక్షన్ గా మార్చి ఎలా తీశారు? అందులో ఫన్, థ్రిల్ ఎంత వరకూ మిక్స్ చేశారు? హాట్ స్టార్ లో ఈరోజు (నవంబరు 19)న విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?
సూర్య (తేజ సజ్జా) కెరీర్లోనే కాదు. లైఫ్‌లోనూ ఫెయిల్ అయిపోతాడు. తన వల్లే తండ్రి చనిపోయాడన్న గిల్ట్ ఫీలింగ్ వెంటాడుతుంటుంది. మరోవైపు… వెన్నెల (శివాని)దీ అలాంటి కథే. జీఈటీ ఎగ్జామ్ పాస్ అయి, జర్మనీ వెళ్లాలన్నది తన కల. కానీ.. జీఈటీలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అందుకే ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. తనకిష్టం లేని పెళ్లి చేసుకోలేక.. వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా అప్పుడే సూర్య సెల్ నుంచి.. వెన్నెలకు మెసేజ్ వస్తుంది. అయితే… ఈ రెండు ఫోన్ నెంబర్లూ.. ఒక్కటే. ఒకే ఫోన్ నెంబర్ ఇద్దరికి ఎలా వచ్చిందన్నది పెద్ద ప్రశ్న. అయితే.. ఇద్దరికీ ఒకే ఫోన్ నెంబర్ అయినా, ఇద్దరూ వేర్వేరు కాలాల్లో ఉన్నారన్న సంగతి అర్థమవుతుంది. వేర్వేరు కాలాల్లో ఉన్న అమ్మాయి, అబ్బాయి ఎలా మాట్లాడుకున్నారు? ఇద్దరూ ఎలా ప్రేమించుకున్నారు? ఇద్దరూ కలిశారా, లేదా? ఇవన్నీ.. తెలుసుకోవాలంటే `అద్భుతం` చూడాలి.
ఓ కొరియన్ కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఆల్మోస్ట్… ఫ్రీమేకే అనుకోవాలి. ఇది వరకు ఇదే కాన్సెప్ట్ తో.. `ప్లే బ్యాక్` అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూసినవాళ్లకు `అద్భుతం` కొత్తగా ఏం అనిపించదు. `ప్లే బ్యాక్` చూడని వాళ్లకు మాత్రం ఇది థ్రిల్లింగ్ కాన్సెప్టే. ఒకే ఫోన్‌నెంబర్ ఇద్దరికి రావడం ఏమిటి? అదీ.. గతంలోని వ్యక్తి.. ఈకాలం నాటి వ్యక్తికి ఫోన్ చేయడం ఏమిటి? అనేది కాస్త వింతగా అనిపిస్తుంది. అది సాధ్యమేనా? అని అక్కడే ఆగిపోతే.. ఈ సినిమాని కనెక్ట్ అవ్వడం కష్టం. సెన్స్ ఫిక్షన్ లో, అందునా సినిమాలో ఏదైనా చల్తా అనుకుంటే సినిమాని ఫాలో అయిపోవొచ్చు. సూర్య, వెన్నెల పాత్రల్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం, వాళ్ల బాధలు చెప్పుకోవడం వరకూ.. సినిమా కాస్త బోరింగ్ స్పేస్ తోనే మొదలవుతుంది. అయితే ఇద్దరివీ ఒకటే ఫోన్ నెంబర్లు అని తెలుసుకోవడం దగ్గర్నుంచి కాస్త ఆసక్తి కలుగుతుంది. ఇద్దరూ వేర్వేరు కాలాల్లో ఉన్నారన్న సంగతి తెలిశాక.. ఆ ఆసక్తి ఇంకాస్త పెరుగుతుంది.అక్కడి నుంచి.. ప్రతీ అరగంటకీ ఓ మలుపు ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అందులో కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటే, ఇంకొన్ని తేలిపోయి మరింత కన్ఫ్యూజ్కి గురి చేశాయి.
ఫ్లాష్ బ్యాక్‌లో… సూర్య చెప్పిన ప్రేమకథ కాస్త బోరింగ్ గా సాగింది. ఒకే పాయింట్ చుట్టూ కథ తిరగడం, దాదాపు రెండు పాత్రల మధ్యనే ఎక్కువ సీన్లు నడిపించడం వల్ల – కథనం నత్తనడక నడుస్తున్న ఫీలింగ్ కలుగుతంది. అయితే క్లైమాక్స్ కి ముందొచ్చే ట్విస్ట్ వల్ల… మళ్లీ కాస్త సర్దుకుంటుంది. వేర్వేరు కాలాల్లో ఉన్న ఇద్దరూ చివర్లో కలుసుకోవడం మాత్రం సెన్స్ ఫిక్షన్ కి అందని సినిమాటిక్ లిబర్టీ. కథని విషాదాంతంగా మార్చినా ఫర్వాలేదు. కానీ విషాదాంతాలు తెలుగు ప్రేక్షకులకు ఎక్కువు.. అని చివర్లో మార్చి ఉంటారు. ఫారెన్ సినిమాలు తరచూ చూసేవాళ్లకు `అద్భుతం` కాన్సెప్టు దాన్ని నడిపించే విధానం పెద్దగా ఆనక పోవచ్చు. కానీ… తెలుగు వరకూ ఇది ఓ విభిన్నమైన చిత్రమే. రొటీన్ రెగ్యులర్ ఫార్ములాలకు దూరంగా.. నడిచిన వెరైటీ ప్రేమకథ. ఇదే కథని మరింత కపడ్బందీగా, లాజిక్ లకు దగ్గరగా తీసుంటే ఇంకా బాగుండేది.
తేజలో మంచి నటుడున్నాడని అతని చిన్నప్పుడే అర్థమైంది. బాల నటుడిగా చేయడం వల్ల, ఏ ఎమోషన్ ని ఎంత వరకూ పండించాలో అనుభవం గడించాడు. తన కథల ఎంపిక కూడా విభిన్నంగా సాగుతోంది. సూర్య పాత్రలో తేజ పర్ఫెక్ట్ గా సూటైపోయాడు. ఇందులోనూ దాదాపుగా అన్ని రకాల ఎమోషన్లనీ చూపించే స్పేస్ దక్కింది. శివాని మాత్రం రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. తనకు ఇదే తొలి సినిమా. కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ అంతగా నప్పలేదు. తండ్రి రాజశేఖర్ పళ్లన్నీ బయటపెట్టి నవ్వినప్పుడు.. చాలా బాగుంటాడు. తన ట్రేడ్ మార్క్ స్మైల్ అది. కానీ శివాని నవ్వినప్పుడు మరింతగా తేలిపోతోంది. సత్య కొన్ని కామెడీ పంచ్‌లు వేయడానికి ఉపయోగపడ్డాడు. శివాజీరాజా మరోసారి మంచి తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు.
కొరియన్ లైన్ ని తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఈజీగానే మార్చుకోగలిగాడు దర్శకుడు. లక్ష్మీభూపాల అందించిన సంభాషణలు కొన్ని చోట్ల బాగా పేలాయి. పాటలైతే మైనస్. అసలు ఒకపాటా చెవులకు ఎక్కదు. ఇలాంటి కాన్సెప్టులకు థ్రిల్లింగ్ మూమెంట్స్ అవసరం. ఈ సినిమాలో అలాంటి మూమెంట్సూ ఉన్నాయి. కాకపోతే… ఆ డోసు సరిపోలేదు. సెన్స్ ఫిక్షన్ కి సంబంధించిన టెర్మినాలజీని అప్పజెప్పి – ఈకథకి లాజిక్కులు కూడా ఉన్నాయనే ప్రయత్నం చేశారు. కానీ ఆ సన్నివేశాలు, అందులోని సంభాషణలు ఏవీ.. ప్రేక్షకుల బుర్రకు ఎక్కవు. సినిమా నిడివి విషయంలోనూ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.