ఒక్కో దర్శకుడిదీ ఒక్కో శైలి. కొంతమంది మాస్ సినిమాలు బాగా తీస్తారు. ఇంకొంతమంది క్లాస్‌కి పరిమితమైపోతారు. అయితే మన దగ్గర మాస్ దర్శకులే ఎక్కువ. సడన్‌గా ఏ హీరోకైనా బుద్దిపుట్టి ఓ క్లాస్, ఫ్యామిలీ సినిమా చేయాలనిపిస్తే, అలాంటి కథని టేకప్ చేసే దర్శకులే లేకపోయారు. అలాంటి తరుణంలో శ్రీకాంత్ అడ్డాల కనిపించాడు. కొత్తబంగారులోకం సినిమా చూసి శ్రీకాంత్‌తో జట్టు కట్టడానికి చాలామంది ఉత్సాహం చూపించారు. సీతమ్మ వాకిట్లో సినిమా చూసి ఇక ఫ్లాటైపోయారు. ఫ్యామిలీ, సెంటిమెంట్ సినిమా అంటే శ్రీకాంత్ దగ్గరకు వెళ్లాల్సిందే అనుకొన్నారు. ముకుంద సో.. స్లోగా సాగినా, శ్రీకాంత్ డిమాండ్‌కి పెద్ద ముప్పేం ఏర్పడలేదు. అయితే బ్రహ్మోత్సవం మాత్రం ఆయనపై పెట్టుకొన్న అశల్నీ, అంచనాల్నీ దారుణంగా దెబ్బకొట్టింది.
ఫ్లాపులు, డిజాస్టర్లు తెలుగు సీమకు కామనే. ఫ్లాప్ వచ్చినంత మాత్రాన దర్శకుడిలో విషయం లేదని కాదు. కాకపోతే.. బ్రహ్మోత్సవం చూస్తే.. ఇతనేంటి, ఇలా తీశాడు? అనిపించక మానదు. శ్రీకాంత్ బలం.. ఫ్యామిలీ ఎమోషన్స్. అయితే దాన్ని చూపించడంలోనూ దారుణంగా పల్టీకొట్టాడు. చాలామంది మహేష్ అభిమానులు ఇక శ్రీకాంత్ అడ్డాల సీరియళ్లు తీసుకోవడం బెటర్ అనేశారు. వాళ్ల ఆక్రోశం అర్థం చేసుకోదగినదే. అయితే.. ఇప్పుడు శ్రీకాంత్ కూడా అయోమయ పరిస్థితుల్లో పడిపోయాడు. తదుపరి ఎలాంటి సినిమా చేయాలి? ఎవరితో వెళ్లాలి? అనేదీ ఆయనకు అర్థం కావడం లేదు. సడన్ గా ఓ టాప్ హీరో అవకాశం వచ్చినా… శ్రీకాంత్ అడ్డాల ఇప్పటికిప్పుడు ప్రాజెక్టుని టేకప్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే… ఆడియన్స్ మెండ్ సెట్ ఏమిటో ఆయనకీ తెలియడం లేదు.
తను బాణీ మార్చాలా? లేదంటే మళ్లీ కుటుంబ కథనే ఎంచుకోవాలా? అనే విషయం తేల్చుకోలేక పోతున్నాడు అడ్డాల. శ్రీకాంత్‌కి కాస్త గ్యాప్ అవసరం. తన తప్పులేంటో, తన మెప్పులేంటో తెలుసుకోవడం ఇంకా అవసరం. ఎందుకంటే శ్రీకాంత్ లాంటి దర్శకుడు టాలీవుడ్‌కి అవసరం కాబట్టి. మాస్, మసాలా, యాక్షన్ రణగొణ ధ్వనుల మధ్య.. చక్కటి సినిమా చూడాలంటే, మనకూ దర్శకులు కావాలి కదా? శ్రీకాంత్ తప్పు చేయొచ్చు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నవి ఎప్పుడూ తప్పు చేయవు. కాకపోతే సరిగ్గా హ్యాండిల్ చేయాలంతే. ఆ దమ్ము శ్రీకాంత్‌కి ఉంది. కావల్సిందల్లా కాస్త ఓర్పు, నేర్పు.. అంతే.