జగన్ దేవుడి బిడ్డ. అందుకే…ఇలా ఉద్యోగాలిస్తున్నారు. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోను ఎన్నికలకు 6 నెలల ముందు అమలు చేసేవి. కానీ జగన్ ఎన్నికయిన ఆరు నెలల్లో అమలు చేసేశారు అంటూ… గత నెల 30వ తేదీన పొగడ్తల వర్షం కురిపించారు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్. అదీ కూడా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే. అందే.. గట్టిగా పది రోజులు గడిచే సరికి.. ఆయనకు నజరానా దక్కేసింది. ఆయనకు అదనంగా మరిన్ని అధికారాలు కల్పిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక శాఖ సీఈవో, లీడర్ షిప్ ఎక్సలెన్స్, గవర్నెన్స్ ఎండీగా .. అదనపు పదవి ఇచ్చారు. ఇప్పటి వరకూ.. ఈ పదవిలో ఉన్న సంజయ్ గుప్తా అనే అధికారిని అటవీశాఖకు పంపేశారు. నిజానికి ఈ విజయ్ కుమార్… సచివాలయ ఉద్యోగాల భర్తీలో కీలకంగా వ్యవహరించారు. అన్ని విషయాల్లో వేలు పెట్టి… అవకవతకలు జరగడానికి ప్రధాన కారణం అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ప్రభుత్వం అంతా స్వచ్చంగా జరిగిందని నమ్ముతోంది కాబట్టి… ఆయన కూడా.. ప్రభుత్వంపై అంతే నమ్మకం పెట్టుకున్నారు. సీఎంను విపరీతంగా పొగడ్తలతో ముంచెత్తుతూ..అదనపు పదవులు పొందుతున్నారు.
నిజానిక ఏపీ సర్కారులో పరిస్థితి ఇంతే ఉంది. ఎంత విధేయత చాటుకుంటే.. అంత పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం కాకపోతే.. ఇతరులు ఎవరైనా.. తమ విధేయతను నిరూపించుకోవాల్సిందే. పాత పరిచయాలు ఉంటే.. ఎలాగోలా.. పోస్టింగ్ తెచ్చుకుంటారేమో కానీ… లేకపోతే.. మాత్రం.. విధేయతా ప్రదర్శన చేయాల్సిందేననన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరి పని వారు చేసుకుపోయే అధికారులకు ప్రాధాన్యతా పోస్టులు దక్కడం లేదు. దాంతో.. చాలా మంది సిన్సియర్‌గా పని చేస్తారని అనుకుంటున్న వారంతా లూప్ లైన్లోకి వెళ్లిపోయారు.
టీడీపీ హయాంలో కీలకంగా పని చేసిన అధికారులు చాలా మందికి ఇప్పటికీ పోస్టింగ్ దక్కలేదు. పలువురు సీనియర్ అధికారులు… ఖాళీగానే ఉన్నారు. కొంత మంది డిప్యూటేషన్ పై వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిని సొంత రాష్ట్రాలకు కూడా ప్రభుత్వం రిలీవ్ చేయడం లేదు. కానీ తమ వారు అనుకున్న వారికి మాత్రం.. ఒకటికి మూడు బాధ్యతలు అప్పగిస్తూ… తరచూ నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వంలోని అధికారుల్లో.. సగం మందిని … తమ వారు కాదన్నట్లుగా.. ప్రభుత్వం చూస్తూండటంతో అధికారుల్లో విభజన స్పష్టంగా కనిపిస్తోంది.