అదానీకి రేవంత్ రెడ్డి ఆప్తుడయ్యారు. తెలంగాణ స్కిల్ యూనివర్శిటీకి సాయం చేయాలని రేవంత్ అడిగారో లేకపోతే అదానీకే ఇవ్వాలని అనిపించిందో కానీ హైదరాబాద్ వచ్చేసి రూ. వంద కోట్ల చెక్కును రేవంత్ చేతిలో పెట్టేశారు. ఈ హఠాత్ పరిణామం తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. కొద్ది రోజుల కిందట అదానీ సీక్రెట్ గా హైదరాబాద్ వచ్చి పొంగులేటి, సునీల్ కనుగోలుతో భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. కానీ ఎవరూ ధృవీకరించలేదు.
ఇప్పుడు మాత్రం అధికారిక భేటీ రేవంత్ రెడ్డితోనే జరిగింది. ఈ స్కిల్ యూనివర్సిటీకి నిధులు సమీకరిస్తున్నట్లుగా ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఇప్పటి వరకూ ఏ పారిశ్రామిక వేత్త కూడా ఇవ్వలేదు. మొదటి సారి అదానీ ఇచ్చారు. ఇలా వంద కోట్ల చెక్కు ఇవ్వడమే కాదు యువత స్కిల్స్ ను అభివృద్ది చేసేందకు అవసరమైన ప్రతి కార్యక్రమంలోనూ తోడుగా ఉంటామని హామీ ఇచ్చి వెళ్లారు.
ఓ పారిశ్రామిక వేత్త వంద కోట్లు విరాళం ఊరకనే ఇవ్వరు. ముఖ్యంగా అదానీ లాంటి వాళ్లు.. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కు అసలు ఇవ్వకపోవచ్చు. కానీ రేవంత్ , అదానీ మధ్య బంధం.. కాంగ్రెస్కు భిన్నమైనదిగా కనిపిస్తోంది. అదానీని కాంగ్రెస్ సంస్థాగతంగా వ్యతిరేకిస్తుంది. కానీ రేవంత్ మాత్రం ఆప్తుడిగా చూసుకుంటున్నారు.