తెలుగు360 రేటింగ్: 1.5/5
పులి
కుక్క
ఏనుగు
ఈగ..
ఇలా జంతువులన్నీ దాదాపుగా అయిపోయాయి. ఇక ఏం మిగిలింది? అని క్వశ్చనింగు వేసుకుంటే… రవిబాబుకి `పంది` కనిపించింది. పందికి సెంటర్ క్యారెక్టర్ చేసి ఓ కథ అల్లుకోవాలి, దాన్ని యానిమేషన్ సినిమాగా తీర్చిదిద్దాలన్న ఆలోచన వరకూ `బాగుంది`. కానీ ఏ కథకైనా, సినిమాకైనా ఆలోచన సరిపోదు. ఆచరణ కావాలి. ఆ పాయింట్‌ని సినిమాగా ఎలా మలచాలి? రెండు గంటల పాటు ఎలా కూర్చోబెట్టాలి అనే విషయంపై కసరత్తు అవసరం. అలాంటి కసరత్తు చేస్తే.. అది ‘ఈగ’ అవుతుంది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి, రాసింది- తోచింది – తీస్తూ వెళ్లిపోతే అది ఇదిగో ఇలా ‘అదుగో’ అవుతుంది.
కథ
బంటి (పందిపిల్ల) చుట్టూ తిరిగే కథ ఇది. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన బంటి.. అనుకోకుండా ఓ మైక్రో చిప్ మింగేస్తుంది. ఆ చిప్ కోసం బంటి కోసం రెండు ముఠాలు గాలిస్తుంటాయి. చివరికి అది అభిషేక్ (అభిషేక్ వర్మ) రాజీ (నభా నటేశా) దగ్గరకు చేరుతుంది. హైదరాబాద్‌లో పంది పిల్లల రేస్ జరుగుతుంటుంది. అందుకోసం బంటి అవసరం అవుతుంది. ఆ బంటి కోసం మరో రెండు గ్రూపులు వెదుకుతుంటాయి. వీళ్ల చేతికి బంటి చిక్కిందా, లేదా? ఆ ప్రహసనంలో బంటి వల్ల మిగిలినవాళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేదే చిత్ర కథ.
విశ్లేషణ
`ఈగ`తో సినిమా ఏమిటిలే.. అనుకున్నవాళ్లకు రాజమౌళి ఓ అద్భుతం చూపించేశాడు. ఏనుగుతో తీసిన `రాజేంద్రుడు గజేంద్రుడు` మామూలు సినిమానా..?? అంటే ఇక్కడ పాయింట్, ఏ జంతువుని కథలో భాగం చేశారన్నది కాదు. దాన్ని ఎంత బాగా, ఎంత అందంగా చూపించారన్నదే. పందితో సినిమా అనగానే చాలామందిలో డౌట్లు పుట్టేసుంటాయి. పంది అనగానే చాలామంది చిరాకు పడతారు, అసహ్యంగా చూస్తారు. ముస్లింలకైతే అది అంటరాని జంతువు. ఇలాంటి పందితో సినిమా అంటే.. రవిబాబు చాలా జాగ్రత్తగా కథ రాసుకోవాలి. తెరపై కనిపిస్తోంది పంది కాదు.. బంటి అనే పాత్ర అని నమ్మించాలి. కానీ అవేం జరగలేదు. గ్రాఫిక్స్‌ని నమ్ముకుని జిమ్మిక్స్ చేద్దాం.. అనుకుని రంగంలోకి దిగిపోయాడు.
పంది అంటే ఎంత అసహ్యంగా చూస్తారో… అంతకంటే చిరాగ్గా కొన్ని సన్నివేశాలు సృష్టించాడు. అవి చూస్తే…. అసలు రవిబాబు ఏం అనుకుని ఈ సన్నివేశాలు రాసుకున్నాడా అనిపిస్తుంటుంది.పంది రౌడీలకు లిప్ లాక్కులు పెడుతుంటుంది. పంది కడుపులో ఉన్న చిప్‌ని బయటకు తీయడానికి రౌడీ మూక చేసే ప్రయత్నాలకు చిరాకేస్తుంది.ఓ పాత్ర కనిపించినవాళ్లందరి మొహంమీద ఉమ్మేస్తుంటుంది. ఇదంతా కామెడీ అనుకోవాలా..? ఇంతకంటే నవ్వించే సన్నివేశాలు రవిబాబుకి దొరకలేదా?
రవిబాబులో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. తన సినిమాల్లో వినోదం చాలా సహజంగా అనిపిస్తుంది. రవిబాబు బలం అదే. కానీ ‘అదుగో’లో ఆ మ్యాజిక్ కనిపించదు. ప్రతీ సన్నివేశం కృతకంగా తయారైంది. అసలు అది ‘బంటి’కాదు పందిపిల్ల.. అని ప్రేక్షకుడు ఫిక్సయిపోయినప్పుడు, తెరపై కనిపిస్తోంది గ్రాఫిక్ అని మైండ్‌లో బలంగా నాటుకుపోయినప్పుడు తెరపై సాగుతోంది తోలుబొమ్మల ఆటగా కనిపిస్తుంది తప్ప.. సినిమా అనిపిస్తుందా..?
ఒకే పాయింట్‌పై సాగే ఇలాంటి సినిమాలు అయితే నవ్వించాలి, లేదంటే థ్రిల్ కలిగించాలి. ఇవి రెండూ ‘అదుగో’ సాధించలేకపోయింది. రవిబాబుకి బలంగా మారిన కామెడీ.. ఈ సినిమాలో బలహీనంగా కనిపిస్తుంది. పాత్రలు తేలిపోయాయి. అభిషేక్ అనే పాత్రని.. తన నటనని అస్సలు చూడలేం. లవ్ ట్రాక్ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. ఇలా అడుగడుగునా బలహీనతలతో సాగిన సినిమా ‘అదుగో’.
నటీనటులు
రవిబాబు మినహా మిగిలినవాళ్లంతా అరకొర సినిమాలు చేసినవాళ్లే. సీనియర్ అయిన రవిబాబే.. ఏం చేయలేకపోయాడు. ఇక మిగిలినవాళ్ల గురించి ఏం చెప్పాలి..?? నభా అందంగా కనిపించింది. దానికి పూర్తి వ్యతిరేకం అభిషేక్. రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కాస్త బెటర్ అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా చూస్తే… తక్కువ బడ్జెట్లో క్వాలిటీ చూపించగలిగాడు. ఆ విషయంలో రవిబాబుని మెచ్చుకోవాలి. లైవ్ యానిమేషన్ సినిమా తీయడం మాటలు కాదు. పైగా తెలుగు తెరకు కొత్త. అందుకే… టెక్నికల్‌గా ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ నిందించలేం. కాకపోతే.. పాటలు, సంగీతం, మాటలు.. ఈ విషయాల్లో మెరుపులు ఆశించలేం.
తీర్పు
అయితే బొమ్మ – లేదంటే బొరుసు.. ఇదీ రవిబాబు పరిస్థితి. ఒక్కోసారి అనసూయలాంటి సినిమాతో ‘అరె.. ‘ అనిపిస్తాడు. తనే ‘లడ్డూబాబు’ లాంటి సినిమా తీసి షాకిస్తాడు. ఈసారీ అంతే. ‘రవిబాబు మరీ ఇలాంటి సినిమా తీశాడేంటి చెప్మా..?’ అని బుర్ర గోక్కునేలా చేశాడు. తన సినిమాల్లో చివరి నుంచి మొదటి ప్లేసు ఇవ్వాలనుకుంటే… ‘అదుగో’ని వెంటనే చేర్చేయొచ్చు.
ఫినిషింగ్ టచ్: పరుగో.. పరుగు
తెలుగు360 రేటింగ్: 1.5/5