తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో లంబాడీ ఆదివాసీ ఘర్షణ ప్రభుత్వ వర్గాలలో ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ రెండు వర్గాల ఘర్షణ గృహదహనాలు, అల్లర్లకు దారితీసింది.లంబాడా టీచర్లు చెప్పే పాఠశాలలను ఆదివాసులు బహిష్కరించారు. రిజర్వేషన్ల జాబితా నుంచి లంబాడాలను తొలగించాలన్న ఆదివాసుల కోర్కె, దానిపై లంబాడా నేతల ఆగ్రహావేశాలు ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. ఉన్నంతలో మైదాన ప్రాంతాలలో స్థిరపడి అభివృద్ధి సాధించిన లంబాడాలను గిరిజనులుగా పరిగణించి రిజర్వేషన్ ఇస్తే తమకు అసలు న్యాయం జరగదనేది ఆదివాసుల వాదన, ఎస్టి ప్రజా ప్రతినిధులు దాదాపుగా లంబాడా నాయక్‌లే వుంటున్నారు. ఐఎఎస్లలోనూ వారిదే సింహభాగం.ఈ నేపథ్యంలో ఒక అధికారి ఇచ్చిన ఉత్తర్వు అలజడికి కారణమైందంటున్నారు. చివరకు ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపి రమేష్ రాథోడ్, ఎంఎల్ఎ రేఖా నాయక్‌ల మధ్య వైరం కూడా ఇందుకు దోవతీసిందనే ఆరోపణలున్నాయి. ఉద్రిక్తత కారణంగా ప్రభుత్వం ముగ్గురుకలెక్లర్లను ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేయాల్సి వచ్చింది. కేంద్రం కూడా ఈ ఘటనపై ఉలిక్కిపడి సమాచార సేకరణ కోసం నిఘా వర్గాలను పురమాయించింది.ఈ పరిస్థితిని మావోయిస్టులు ఉపయోగించుకోకుండా చూడాలని కూడా ఆదేశాలు వచ్చాయట. ఇరు వర్గాల మధ్య సఖ్యతను కాపాడి రిజర్వేషన్ల విషయంలో తగు పరిష్కారం కనుగొనడం ఇప్పుడు తక్షణం జరగాల్సిన పని.