ఆదిలాబాద్ జిల్లా రాజకీయంలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్ అసంతృప్తుల్ని కవర్ చేయలేక తంటాలు పుడుతోంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల్ని ప్రకటించక ముందే ఈ పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులంతా ప్రచారం ప్రారంభించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంత్రి జోగు రామన్న ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. ప్రచార గడువు ముగిసిపోతోందా అన్నంత హడావుడిగా ప్రచారం చేస్తున్నారు. నిర్మల్ లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రచారానికి చాలా సమయం ఉందన్న ఉద్దేశంతో విపక్ష పార్టీల నుంచి ముఖ్య నాయకులుగా ఉన్న వారిని టీఆర్ఎస్లోకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇంద్రరణ్ రెడ్డికి టీఆర్ఎస్ నేత శ్రీహరి రావు నుంచి అసంతృప్తి సెగలు తగులుతున్నాయి.
ముథోల్ టిఆర్ఎస్ అభ్యర్థి ,తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సైతం ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. విఠల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి వర్గీయులు జీర్ణించుకోవడం లేదు. వేణుగోపాలా చారి సేవలను జిల్లా వ్యాప్తంగా వినియోగించుకోవడం ద్వారా వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే చారితో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంప్రదింపులు కూడా జరిపారు. చారీ వర్గీయులు సహకరించకున్నా.. విఠల్ రెడ్డి గ్రామాలను చుట్టివస్తున్నారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలోనూ టిఆర్ఎస్ అభ్యర్థి,తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రచారం చేసుకుంటున్నారు. లంబాడా సామాజికవర్గానికి చెందిన రేఖానాయక్ కు టికెట్ ఇవ్వడాన్ని ఆదివాసీ సంఘాలు తప్పు పడుతున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ కాంగ్రెస్ లో చేరిపోయారు. అటు బోథ్ నియోజకవర్గంలోనూ టిఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఎంపీ నగేష్ నుంచి అసమ్మతి సెగ తగలుతోంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి,తాజా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ప్రచారంలో ముందు ఉన్నారు. ఆసిఫాబాదు తో పాటు జైనూర్ మండల కేంద్రంలోనూ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ…అభ్యర్థిత్వం ఖరారు కాక ముందు నుంచే గ్రామాలను చుట్టి వస్తున్నారు. నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే తనను మరో సారి ఆదరించాలని ప్రజలను వేడుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోనూ టిఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ప్రచారంలో జోరుమీద ఉన్నారు. నియోజకవర్గం మొత్తం చుట్టి వస్తున్నారు. తాను నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్దిని చూసి ఆదరించాలని ప్రజలను కోరుతున్నారు. కోనప్ప వ్యతిరేక వర్గం ఆయనకు దూరం అవుతోంది. ఆయనను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఇతర పార్టీల నేతలకు పలువురు బహిరంగ మద్దతు ఇస్తున్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అసమ్మతి సెగ తలుగుతోంది.అభ్యర్థిత్వం ఆశించిన భంగపడ్డ రేణికుంట్ల ప్రవీణ్ వర్గం నిరాశలో ఉంది. తమ నేతకు అన్యాయం జరిగిందన్న భావనలో ఉన్నారు. అంతేగాక మాజీ ఎంపి వివేక్ వర్గం కూడా ఇంకా చిన్నయ్యతో కలవడం లేదు. ఇక మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి దివాకర్ రావు కాంగ్రెస్ లో నెలకొన్న వర్గ విభేదాలు తనకు కలిసి వస్తాయని ఆశతో ఉన్నారు. అయితే దివాకర్ రావు అభ్యర్థితత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు ఆయనను ఓడించి తీరుతామని శపథాలు చేస్తున్నారు. దివాకర్ రావు ను విభేదిస్తున్న మంచిర్యాల ఎంపిపి బేర సత్యానారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేశారు. చెన్నూరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి,పెద్దపల్లి ఎంపి సుమన్ ప్రచారం ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. నల్లాల ఓదెలు అలక,గట్టయ్య ఆత్మహత్య ఎపిసోడ్ తో పరిస్థితులు బాగా లేవని అంచనా వేసిన సుమన్….కొద్ది రోజులుగా హైదరాబాదు,మంచిర్యాలలోనే ఉంటున్నారు. ఓదేలు మెత్తబడ్డారని అనుకున్నారు.. కానీ ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఎప్పటినుంచో ఇల్లిల్లు తిరుగుతున్నారు. తన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా చీరలు కూడా పంపిణీ చేస్తున్నారు.