బూడిద రవాణా కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాణరెడ్డి వర్గాలు కొట్టేసుకునేందుకు రెడీ అయ్యాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న ఆర్టీపీపీ నుంచి రోజూ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే బూడిదను తాడిపత్రిలోని కొన్ని సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తారు. వాటిని రవాణా చేసేందుకు మా వాహనాలంటే మా వాహనాలే వాడాలని అటు ఆది వర్గీయులు.. ఇటు జేసీ వర్గీయులు పట్టుబడుతున్నారు.
బూడిద మా దగ్గర ఉందని.. కాబట్టి మా వాహనాలతో తరలిస్తామని ఆదినారాయణరెడ్డి వర్గీయులు అంటున్నారు. కానీ తరలించేది తాడిపత్రికి కాబట్టి అవి మా వాహనాలే కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఇరువురి మధ్య పంచాయతీ పెరిగిపోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటివి మాటలతో తేల్చుకోరు. డైరక్ట్ గా చేతలే. అందుకే ఆయన వార్నింగ్ ఇచ్చి.. వాహనాలతో తాడిపత్రికి వెళ్లేందుకు రెడీ అయ్యారు.
జమ్మలమడుగులో ఇతరులు ఏమి చేయాలన్నా మా కనుసన్నల్లో చేయాల్సిందేనని అనుకునే ఆదినారాయణరెడ్డి వర్గీయులు జేసీని అడుగు పెట్టనిచ్చేందుకు సిద్దంగా లేరు. ఇటీవల అదానీ సంస్థలపైనే దాడి చేశారు. ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయనకు ఎలా చెప్పాలో టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయకపోతే రచ్చకెక్కుతారని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.