కడప జిల్లా టీడీపీకి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ మేరకు.. ఆదివారం సీక్రెట్‌గా హైదరాబాద్‌లో.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాష్ నడ్డాను కలిశారు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓ నేత ఆయనను.. నడ్డా వద్దకు తీసుకెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో… నడ్డా.. ఆదినారాయణరెడ్డిని.. బీజేపీలోకి ఆహ్వానించారని.. ఆయన సమయం తీసుకుని.. నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీలో చేరే ఉద్దేశమే లేకపోతే.. ఆదినారాయణరెడ్డి నడ్డా వద్దకు వెళ్లే వారు కాదనే అంచనాలున్నాయి.
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో.. ఆదినారాయణరెడ్డి బలమైన నేతగా ఉన్నారు. అక్కడ పార్టీల కన్నా.. వర్గాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఓ వైపు ఆదినారాయణరెడ్డి, మరో వైపు రామసుబ్బారెడ్డి రెండు పార్టీల తరపున హోరాహోరీగా తలపడేవారు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరూ కలిసిపోయారు. అయినప్పటికీ… ఇద్దరికీ చేదు అనుభవమే ఎదురయింది. అది కూడా… ఇద్దరూ కలిసినా వైసీపీకి యాభై వేల ఓట్లకుపైగా మెజార్టీ వచ్చింది. అలా ఎలా వచ్చిందో.. ఎవరికీ అర్థం కాలేదు. ఈ క్రమంలో.. వైసీపీ ప్రభుత్వం నుంచి… ఆదినారాయణరెడ్డికి సెగ ప్రారంభమయిందని చెబుతున్నారు. అనుచరులపై దాడులు.. ఇతర కేసుల వ్యవహారంలో.. అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోతూండటంతో.. రక్షణ కోసమైనా.. బీజేపీ వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
భారతీయ జనతా పార్టీ కూడా.. రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైసీపీని ఎదుర్కోవాలంటే… రక్షణ కావాల్సిందేనని.. ఆ రక్షణ తామిస్తామని.. టీడీపీ నేతలకు అభయమిస్తారు. ఇప్పటికే ధర్మవరం టీడీపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి బీజేపీ గూటికి చేరి.. ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు.. ఆదినారాయణ రెడ్డి కూడా.. అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ మార్క్ రాజకీయాలను ఎదుర్కోవాలంటే.. కనీసం.. ఏదో ఓ అధికారపారటీ అండ ఉండాలన్న ఉద్దేశంతో.. బీజేపీ వైపే నేతలు మొగ్గుతున్నారు.