మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. టీడీపీలో ఉన్న సమయంలో సీఎం రమేష్‌కు, ఆదినారాయణరెడ్డికి పడేది కాదు. ముందుగానే సీఎం రమేష్ బీజేపీలో చేరిపోయారు. దాంతో… ఆయనే ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని… అందుకే ఆలస్యం అవుతుందని చెప్పుకున్నారు. అనూహ్యంగా చడీచప్పుడు లేకుండా ఆదినారాయణ.. ఢిల్లీ వెళ్లిపోయి… బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తో కండువా కప్పించేసుకున్నారు. గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నడ్డాను.. ఆదినారాయణరెడ్డి కలిశారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. అప్పుడే చేరిక ఖరారయింది. సీఎం రమేష్ లాంటి నేతల అభ్యంతరాలతో కొంత కాలం వాయిదా పడింది.
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో.. ఆదినారాయణరెడ్డి బలమైన నేతగా ఉన్నారు. అక్కడ పార్టీల కన్నా.. వర్గాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఓ వైపు ఆదినారాయణరెడ్డి, మరో వైపు రామసుబ్బారెడ్డి రెండు పార్టీల తరపున హోరాహోరీగా తలపడేవారు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరూ కలిసిపోయారు. అయినప్పటికీ… ఇద్దరికీ చేదు అనుభవమే ఎదురయింది. అది కూడా… ఇద్దరూ కలిసినా వైసీపీకి యాభై వేల ఓట్లకుపైగా మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో.. వైసీపీ ప్రభుత్వం నుంచి… ఆదినారాయణరెడ్డికి సెగ ప్రారంభమయిందని చెబుతున్నారు. అనుచరులపై దాడులు.. ఇతర కేసుల వ్యవహారంలో.. అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోతూండటంతో.. రక్షణ కోసమైనా.. బీజేపీ వైపు చూడక తప్పలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.
భారతీయ జనతా పార్టీ కూడా.. రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైసీపీని ఎదుర్కోవాలంటే… రక్షణ కావాల్సిందేనని.. ఆ రక్షణ తామిస్తామని.. టీడీపీ నేతలకు అభయమిస్తున్నారు. ఇప్పటికే ధర్మవరం టీడీపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి బీజేపీ గూటికి చేరి.. ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు.. ఆదినారాయణ రెడ్డి కూడా.. చేరారు. మరికొంత మంది నేతలతోనూ… బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.