వైఎస్ వివేకా హత్య కేసులో.. సిట్ విచారణకు పిలిస్తే.. తాను ఆజ్ఞాతంలోకి వెళ్లానంటూ.. ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారంపై.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. వివేకా హత్య కేసులో సిట్ నుంచి.. తనకు ఇవ్వాళే నోటీసులు అందాయని.. గురువారం వారి ముందు విచారణకు హాజరవుతానని ప్రకటించారు. వివేకా హత్యకేసులో నా పాత్ర ఉందని నిరూపిస్తే… పులివెందుల నడిబొడ్డున ఉరివేసుకుంటానని ఆదినారాయణరెడ్డి సవాల్ చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు నిరూపించలేకపోతే.. ఏం చేసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో.. సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన.. జగన్ తోపాటు.. వారి కుటుంబసభ్యులు ఇప్పుటు సిట్ విచారణ ను మాత్రమే ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. వాళ్లకు అనుకూలంగా ఉండేందుకే సిట్ విచారణ చేయిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు క్లూలను వదిలేసి.. రాజకీయంగా వచ్చిన ఆరోపణలతో… ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు పంపుతోందని..అంటున్నారు.
వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు… మొదట ఆత్మహత్య అన్న వైసీపీ నేతలు.. ఆ తర్వాత పోస్టు మార్టంలో హత్యగా తేలిన తర్వాత … ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబులపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇంత కాలం విచారణలో ఎక్కడా ఆదినారాయణ రెడ్డి పేరు రాలేదు. రాజకీయంగా మాత్రమే.. వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు సిట్ విచారణకు పిలిచారు.