కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబమే లీడ్ తీసుకుంది. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరినా తాము టీడీపీలోనే ఉన్నామంటూ ఆయన సోదరులు.. కుటుంబీకులు అందరూ వచ్చి చంద్రబాబును కలిశారు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తన భూపేశ్కు నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఇవ్వాలని కోరారు. చంద్రబాబు కూడా అంగీకరించారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి జమ్మలమడుగు ఇన్చార్జిగా ఉన్నారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో ఆయన పులివెందుల నుంచి పోటీ చేస్తారు. దీంతో జమ్మలమడుగుకు బలమైన అభ్యర్థి కావాల్సివచ్చింది. దీంతో ఆది సోదరులు టీడీపీ వైపు మొగ్గారు.
ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడానికి కారణం కేవలం సెక్యూరిటీ కోసమేనన్న ప్రచారం ఉంది. అయితే పార్టీ మారిన వారికి టిక్కెట్ ఇచ్చేందుకు ఈ సారి సిద్ధంగా లేమని టీడీపీ అధినేత తేల్చినట్లుగా చెబుతున్నారు. అందుకే ఆది కుటుంబం టీడీపీలో చేరి… ఆ కుటుంబంలో ఒకరిని టీడీపీ తరపున నిలబెట్టే అలోచన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ గతంలో బలంగా ఉండేది. రామసుబ్బారెడ్డిటీడీపీ ముఖ్య నేతగా ఉండేవారు. తర్వాత ఆదినారాయణరెడ్డిని చేర్చుకుని మంత్రిని చేశారు. అయితే ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఇద్దరూ పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరగా… రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. రెండు పార్టీల్లోనూ ఇద్దరూ సంతృప్తిగా లేరు. బీజేపీలో చేయడానికేం లేక ఆదినారాయణ రెడ్డి సైలెంట్ అవ్వగా… రామసుబ్బారెడ్డి అవమానాలకు గురవుతున్నారు.
ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఎప్పుడో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఓ నేతగా కూడా ఆయనను పరిగణించకపోవడంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. కానీ అధికార పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితిలేదు. కానీ ఉక్కపోత మాత్రం ఎక్కువగానే ఉంది. ఈక్రమంలో ఆయన కూడా పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం నేపధ్యంలో ఆది కుటుంబీకులు ముందుగానే టీడీపీలో కర్చీఫ్ వేశారన్న అభిప్రాయం కడ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.