ప్రభాస్ చేస్తున్న మరో పాన్ ఇండియా సినిమా `ఆది పురుష్`. కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్ చూసి ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతోందని, ఇందులో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తున్నాడని జనాలు భావిస్తున్నారు. అయితే ఈ కథకూ రామాయణానికీ అస్సలు సంబంధం లేదన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.
ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర రామాయణంలో రాముడ్ని పోలి ఉంటుంది. రాముడి గుణ గణాలు ప్రభాస్ పాత్రలో కనిపిస్తాయి. అంతే తప్ప.. ప్రభాస్ రాముడు కాదు. సీత, రావణుడు, హనుమంతుడు.. ఇలా పురాణ పాత్రల్లోని లక్షణాలు తీసుకుని, సినిమాలోని పాత్రలకు అన్వయించారు. అంతే తప్ప – రామాయణాన్ని తెరపై చూపించడం లేదని, రామాయణంలో ఘట్టాలేవీ తెరపై కనిపించవని తెలుస్తోంది.
ఇప్పటికే రామాయణం ఆధారంగా పలు భారతీయ భాషల్లో చాలా సినిమాలొచ్చినా.. వాల్మీకి రామాయణాన్ని ఆ స్థాయిలో తెరకెక్కించిన సినిమా ఒక్కటికూడా రాలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమా కావడం వల్ల ఆదిపురుష్‌పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సైఫ్ అలీఖాన్ని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు. ఇక సీత పాత్రని ఎంచుకోవడం తరువాయి.