దిశ పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించి మూడు రోజులవుతుంది. ఈ నెలలోనే పద్దెనిమిది పోలీస్ స్టేషన్లను ప్రారంభించబోతున్నారు. అయితే.. మూడు రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఎందుకా.. అని ఆరా తీస్తే.. అక్కడి పోలీసులు కేసులు తీసుకోవడం లేదు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం కావడంతో.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని… తనపై సోషల్ మీడియా అసభ్య దూషణలకు దిగుతున్న వారిని శిక్షించాలని ఫిర్యాదు చేశారు. ఆదిరెడ్డి భవాని వెంట.. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వెళ్లారు. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి.. అసభ్య కామెంట్లు పెట్టిన వారందరి వివరాలతో.. సాక్ష్యాలతో సహా.. ఆమె దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం.. తీరిగ్గా… తాము కేసులు రాసుకోవడం లేదని చెప్పారు.
ఎందుకంటే.. దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని అంటున్నారు. చట్టం అమల్లోకి రాకుండా… పోలీస్ స్టేషన్ ఎందుకుందంటే … పోలీసులు నీళ్లు నమలాల్సి వచ్చింది. అసెంబ్లీలో మద్యం అంశంపై మాట్లాడినందుకు సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్స్ చేశారని… స్పీకర్‌కు ఫిర్యాదు చేసి రెండు నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆదిరెడ్డి భవాని అంటున్నారు. దిశ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఇంకా చట్టం అమల్లోకి రాలేదని అంటున్నారు.. దిశ చట్టం పేరుతో సీఎం అబద్ధపు ప్రచారం చేస్తూ.. మహిళల్ని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. దిశ చట్టం అమల్లోకి రావాలంటే.. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి.
అలా వేయాలంటే.. చట్టాన్ని ఆమోదించి…కేంద్రం రాష్ట్రపతికి వద్దకు పంపారు. కానీ దిశ బిల్లులో… ఐపీసీ, సీఆర్పీసీకి సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణలు కేంద్రమే చేయాలి. రాష్ట్రం చేయలేదు. దాంతో.. ప్రతిష్టంభన ఏర్పడిందని కేంద్రవర్గాలు చెబుతున్నాయి. ఈ లోపు… దిశ చట్టం అమల్లోకి వచ్చేసినట్లుగా సీఎం.. పోలీస్ స్టేషన్ ను ప్రారంభించేశారు.