వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని ప్రకటించారు. చంద్రబాబు బాగా పని చేస్తున్నారు…ప్రభుత్వ పథకాలు బాగున్నాయన్నారు. మళ్ళీ సీఎంగా చంద్రబాబే ఉంటారని జోస్యం చెప్పారు. వైసీపీ విధానాలు నచ్చకపోవడం వల్లే బయటికి వచ్చానని అన్ని అంశాలపై బంధువులు, కార్యకర్తలతో చర్చిస్తానని మీడియాకు చెప్పారు. త్వరలో రాజకీయ భవిష్యత్‌పై ప్రకటన చేస్తానని చెప్పుకొచ్చారు.ఫిబ్రవరిలోనే ఆదిశేషగరిరావు కృష్ణ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి… టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికలకు ముందు గల్లా జయదేవ్ తో కలిసి టీడీపీలో చేరాలని అనుకున్నారు. చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అయితే చంద్రబాబు గల్లా జయదేవ్ కు మాత్రమే టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో.. అసంతృప్తి చెందిన ఆయన వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత చాలా కాలం పాటు వైసీపీకే పని చేశారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లు ఏమైనా చాన్సిస్తారేమోనని చూశారు. వాటిలోనూ అవకాశం దక్కలేదు. అయినప్పటికీ.. తెనాలి ఎమ్మెల్యే టిక్కెట్ అయినా ఇస్తారేమోనని ఎదురుచూశారు. జగన్ మాత్రం అదీ కుదరదని చెప్పారు. దాంతో మనస్థాపానికి గురై.. వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు చంద్రబాబును కలిశారు.
నిజానికి.. కృష్ణ సోదరుడు… కాబట్టి.. అభిమాన సంఘాల వ్యవహారాలను ఆయనే చూసేవారు. అభిమానులతో మంచి సంబంధాలున్నాయి. దీన్ని తన రాజకీయ భవిష్యత్ కోసం వాడుకునే ప్రయత్నాన్ని వైసీపీలో ఉన్నప్పుడు.. ఆదిశేషగిరిరావు… ప్రయత్నించారు. నంద్యాల ఉపఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్ సమయంలో.. కృష్ణ, మహేష్ బాబుల మద్దతు ..వైసీపీకేనంటూ ఆయన ఏకపక్షంగా ప్రకటనలు చేసి వివాదాస్పదమయ్యారు. ఆ సమయంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు.. మాత్రం.. టిక్కెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించడంతో.. మళ్లీ టీడీపీ గూటికి చేరారు. చంద్రబాబు పాలన బాగుందని.. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొస్తున్నారు.