జగన్, లోకేశ్ వారసత్వరాజకీయాలపై పవన్కళ్యాణ్ విమర్శలపై చర్చ జరిగినప్పుడు మీరు కూడా మొదట చిరంజీవి వారసుడుగానే వచ్చారని నేను వ్యాఖ్యానించాను. అప్పుడు నాతో వున్న మరో మిత్రుడు ఏమన్నారంటే మొదట అలాగే అన్నలాగా నటించినంత వరకూ పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాలేకపోయారని, తనకంటూ ఒక స్టయిల్ సృష్టించుకున్నాకే టాప్కు చేరారని. అందులో కొంత వాస్తవం వుంది. రాజకీయాల్లో కూడా అలాగే విడివడి తన కంటూ ఒక బాణీ పెంచుకుంటున్నారు.అయితే మూలాలు తెలుసు గనక ఈ మూడు రోజుల పర్యటనలో చిరంజీవిపై ప్రశంసలు భక్తి గౌరవాలు ప్రకటించుకుంటూ వున్నారు. అందులో రాజకీయ అవసరం కూడా వుంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ తరపున వాసిరెడ్డి పద్మ ఒక విధంగానూ ఎంఎల్ఎ నటీమణి రోజా మరో విధంగా స్పందించారు. సహజంగానే ఖండిచారు కూడా. అయితే రోజా వాదనలో మీరు మాత్రం వారసులు కాదా అని అడిగారు.స్త్రీల ట్రాఫికింగ్ పెరుగుదల, గోదావరి పుష్కరాల విషాదం వంటి విషయాలు మీరు తెలుసుకోవద్దా అని ప్రశ్నించారు. అంతటితో ఆగక స్త్రీలపై మీ గౌరవం ఇదేనా అని నిలదీశారు కూడా. అవన్నీ బాగానే వున్నాయి గాని వారసత్వ రాజకీయాలపైనే ఆమె కౌంటర్ సరిగ్గా లేదు. ఈ మధ్యనే నిర్మాత కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావును ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన తను ఎన్టీఆర్ కన్నా వైఎస్ఆర్ కన్నా జగన్ను ఎందుకు ఎక్కువగా అభిమానిస్తారో చెప్పారు.300 సినిమాల మహా నటుడు గనక ఎన్టీఆర్ ఇందిరాగాంధీని ఢీకొనడం వల్ల ఎన్నికల్లోనూ హీరో అయిపోయారు. ఇక చంద్రబాబు నాయుడు మామ సహకారంతో మంత్రిగా వచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు. వైఎస్ కూడా దీర్ఘకాలం కాంగ్రెస్లో వుంటూ ముఖ్యమంత్రి కాగలిగారు. వారితో పోలిస్తే జగన్ సోనియాగాంధీని ఎదిరించి పార్టీని వదలిపెట్టి వంటరిగా పోరాడి ఒక పోటీదారుగా ఎదగడం గొప్ప విసయమని ఆదిశేషగిరి రావు విశ్లేషించారు. వైసీపీ ఏర్పడేనాటికే వైఎస్ లేరు గనక జగన్ను కేవలం వారసుడుగా చూడటానికి లేదు. పైగా ఆంధ్ర ప్రదేశ్లో ఇలా తండ్రి తర్వాత స్వంతంగారాజకీయ పునాది ఏర్పర్చుకున్న ముఖ్యమంత్రి కుమారులు మరి లేరు. అది కూడా కేసులు జైలు శిక్షల నేపథ్యంలో.అయితే రోజా ఇలాటి కోణాల కన్నా ఎదటివారిపై దాడికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు గనక ఆదిశేషగిరిరావులా మాట్లాడటం కుదిరేపని కాదు. తన ట్రేడ్ మార్క్ పదాలైన సిగ్గులేకుండా సిగ్గులేకుండా అని ప్రతి బైట్లోనూ ఉపయోగించడం గమనించవచ్చు.