హైదరాబాద్: విశాఖపట్నంలో ఆరురోజులక్రితం తప్పిపోయిన ఆరేళ్ళ బాలిక అదితి వ్యవహారం ఇంకా మిస్టరీగానే ఉంది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. గాలింపు దళాలు మురుగుకాల్వలలో ఆపేసి పూర్తిగా సముద్రంపైనే దృష్టిపెట్టాయి. డ్రైనేజిలో ఇప్పటికి దాదాపు 20సార్లు గాలించి ఉండటంతో పాప డ్రైనేజిలో లేదనే నిర్ధారణకొచ్చారు. మరోవైపు నిన్న విప్ల సదస్సుకు హాజరవటానికి విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదితి తండ్రి శ్రీనివాసరావును కలిసిన సందర్భంగా అధికారులను పిలిచి సముద్రతీరంలో 100 కిలోమీటర్లవరకు గాలించాలని ఆదేశించారు. తమ పాపను వెదికేందుకు అధికార యంత్రాంగం శక్తిమేరకు యత్నిస్తోందని, అయినా ఆచూకీ దొరకకపోవటం తమ దురదృష్టమని శ్రీనివాసరావు వాపోయారు. నిజంగానే జీవీఎమ్సీ ఈ వ్యవహారంలో అద్భుతంగా కష్టపడిందని అందరూ అంటున్నారు. పాప పడిపోయినరోజు వెంటనే స్పందించటంలో అలసత్వం ప్రదర్శించినట్లు విమర్శలు వ్యక్తమయినా, తర్వాతమాత్రం బాగా కష్టపడినట్లు ప్రశంసలు అందుకుంటోంది. ఒక పెద్ద నాయకుడో, ప్రజా ప్రతినిధో కనిపించకుండాపోతే వెతికిన స్థాయిలో అదితికోసం వెతుకుతున్నారన్నదిమాత్రం ఎవరూ కాదనలేరు. సెర్చ్ ఆపరేషన్ వ్యయం ఇప్పటికే కోటి రూపాయలు దాటిపోయిందని అంటున్నారు.
ఇక అదితికోసం సోషల్ మీడియాలోకూడా అన్వేషణ ప్రారంభమయింది. అదితి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తెలియజేసేందుకువీలుగా finding aditi పేరుతో ఆమె బాబాయి ఫేస్బుక్లో ఒక ఖాతా తెరిచారు. మరోవైపు కిడ్నాప్ కోణంలోకూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ గురుమూర్తిపై నిఘా వేసి ఉంచారు.