తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగబోతున్న వారసుల జాబితాలో.. మరొకరు చేరారు. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు.. అశోక్ గజపతిరాజు స్వయంగా ఈ ప్రకటన చేసారు. 20 వ తేదీన తాను ఎం.పిగా, తన కుమార్తె నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ పెద్దలు తన వారసురాల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరారని తెలిపారు. విజయనగరంలోని తన బంగ్లాలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో పాటు .. తన కుమార్తెకు రాజకీయాల్ని గురించి కూడా వివరించారు. జకీయం అనేది చెత్త బుట్ట లాంటిదని … విభిన్న రకాలు మనుషులు ఉంటారు అలాగే తిట్టేవారు.. పొగిడేవారు ఉంటారు కాబట్టి.. అన్నింటికీ సిద్ధంగాఉండాలని కుమార్తెకు హితబోధ చేశారు. పార్టీలు మారకూడదన్నారు. గెలిచినా ఓడినా ఇదే పార్టీ లో ఉండి ప్రజా సేవ చేయాలని కుమార్తెకు చెప్పారు.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పూసపాటి వంశీయుల కంచుకోట. అశోక్ గజపతి రాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి మొట్టమొదటగా.. 1978లో జనతా పార్టీ తరపున ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు.. ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. గెలుస్తూనేఉన్నారు. 2004లో మాత్రం.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో 1100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడంతో… పీఆర్పీ నుంచి టీడీపీలో చేరిన మీసాల గీతకు అభ్యర్థిత్వాన్ని సిఫార్సు చేశారు. అశోక్ గజపతిరాజు సిఫార్సుతో.. మీసాల గీత టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవకాశం ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కూడా అశోక్ గజపతిరాజు ఎంపీగానే పోటీ చేస్తున్నారు.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు.. ఆ జిల్లా రాజకీయాలు మొత్తం ఎప్పుడూ.. అశోక్ గజపతిరాజు కనుసన్నల్లోనే ఉంటాయి. ఆయన అంగీకరిస్తేనే ఎవరైనా అభ్యర్థి అవుతారు. అందుకే.. ఆ జిల్లాలో టీడీపీ నేతలంతా… ఆశీస్సుల కోసం అశోక్ బంగ్లాకే ముందుగా వస్తారు. మీసాల గీతకు ఇప్పుడు టిక్కెట్ నిరాకరించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. ఆమె అసంతృప్తికి గురయ్యారు. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి… విజయనగరం రాజకీయవర్గాల్లో ఏర్పడింది.