తెలుగు తెరపై వాలిన మరో పరభాషా సోయగం.. అదితి రావు హైదరి. అయితే అందరిలా గ్లామర్ పాత్రలని కాకుండా… నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. ‘సమ్మోహనం’లో ముగ్థమనోహరంగా కనిపించిన అతిథి.. `అంతరిక్షం` కోసం అందుకు పూర్తి విభిన్నమైన పాత్ర పోషించింది. ఈనెల 21న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా అదితిరావ్ హైదరితో చిట్ చాట్..
ఈ కథ విన్నప్పుడు ఏం అనిపించింది? ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా?
– ‘సమ్మోహనం’ చేస్తున్న సమయంలోనే ఈ కథ విన్నాను. తొలిసారి విన్నప్పుడే బాగా నచ్చేసింది. ఇప్పటి వరకు అంతరిక్షానికి వెళ్లిన ఇద్దరు మహిళా అస్ట్రానాయిడ్స్ మన దేశానికి చెందినవారే. వాస్తవాలకు దగ్గరగా ఉండే ఇలాంటి పాత్రలు చేయాలనిపించింది. అందుకే ఒప్పుకున్నా.
ఎలాంటి హొం వర్క్ చేశారు..?
– బల్గేరియా, ఈస్ట్రన్ యూరప్ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులతో కలసి పని చేశాం. రోప్స్ కట్టుకుని అలాగే వేలాడుతూ ఉండటం. గాలిలో పల్టీ కొట్టడం, గాలిలో ఈదడం వంటి సన్నివేశాలున్నాయి. అందుకోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నా. అప్పుడు సరిగ్గా మణిరత్నం `నవాబ్` సినిమా షూటింగ్ చేస్తున్నాను. సాయంత్రం ఫ్టైట్ ఎక్కి చెన్నై చేరుకుని అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని, మళ్లీ పొద్దున్నే హైదరాబాద్ వచ్చి శిక్షణలో పాలు పంచుకునేదాన్ని. రోప్ పట్టుకుని వేలాడే సమయంలో రక్తప్రసరణ అగిపోయేది. చాలా నొప్పిగా అనిపించేది.ఈ పాత్ర కోసం ఉపయోగించిన హెల్మెట్ చాలా బరువుగా ఉండేది. అంత బరువు ఉన్న దాన్ని వేసుకుంటే మెడనొప్పి వచ్చేది. కొన్ని రోజులకు ఆ నొప్పి ఎక్కువైంది. హెల్మెట్ ధరించగానే, భరించలేని నొప్పితో విలవిలలాడాను. డాక్టర్స్ పదిరోజులు విశ్రాంతి తీసుకో అని చెప్పారు. కానీ ఎంతో ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా ఇది. నా వల్ల షూటింగ్లో జాప్యం జరక్కూడదనిపించింది. అందుకే పెయిన్ కిల్లర్స్ తీసుకుని సెట్స్‌కు వచ్చేశాను.
ఈ పాత్ర కోసం ఆస్ట్రానాయిడ్స్ని కలిశారా?
– ఎవరినీ కలవలేదు. అయితే రాకేశ్ శర్మగారి పిల్లలది నాదీ ఒకే స్కూల్. వారి పిల్లల కోసం తరుచుగా మా స్కూలుకు వస్తుండేవారు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడేదాన్ని. అంతరిక్ష్యంలో ఆయనకు ఎదురైన అనుభవాల్ని నాతో పంచుకునేవారు. అయితే ఎంత విన్నా,చదివినా, ప్రాక్టీస్ చేసినా సెట్స్‌లో చేసేటప్పుడు మనకు మనమే అస్ట్రానాయిడ్గా ఫీలై నటించాలంతే!.
ఓ సినిమా ఒప్పుకునే ముందు పాత్ర నిడివి గురించి ఆలోచిస్తారా, లేదా?
– నేను పరిశ్రమలోకి అడుగుపెట్టేటప్పుడు చిన్న పాత్ర చేయాలా? లేక పాత్ర నిడివి ఎక్కువగా ఉంటేనే చేయాలా? అని ఆలోచించలేదు. హాలీవుడ్ లో చూడండి. వాళ్లెప్పుడు నిడివి గురించి ఆలోచించరు. ఈతరం చాలా మారింది. పాత్ర నిడివి కోసం ఎవరూ ఆలోచించడం లేదు.అంతా మంచి పాత్రల కోసమే చూస్తున్నారు. నేను కూడా అంతే. మంచి సినిమాలో భాగమవ్వాలని అనుకుంటున్నా. ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి సినిమా చూసినప్పుడు మన పాత్ర వారికి గుర్తుండిపోతే చాలు. ఆ పాత్ర ఎంత సేపు ఉందనేది అనవసరం. నేను గొప్ప సినిమాలు చేస్తున్నాననో, చేశాననో గర్వపడటం లేదు. నటిగా ప్రతీ సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నాను. నూటికి నూరుపాళ్లూ నా ప్రతిభని అందివ్వాలనే ప్రయత్నిస్తా.
* హైదరాబాద్ టు చెన్నై.. చెన్నై టు హైదరాబాద్… ఇలా చక్కర్లు కొట్టడం ఇబ్బందిగా లేదా?
– నేను పనిని ప్రేమిస్తాను. నిద్రహారాలు కూడా గుర్తుండవు. ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. ఈ సినిమా కోసం పన్నెండు రోజులల పాటు రాత్రీ పగలూ కష్టపడ్డా. పిల్లలకు ఆడుకోవడం ఇష్టం. వారిని గ్రౌండ్లో వదిలేస్తే వాళ్లు ఇంటికి వెళ్లాలనుకోవడం కూడా మరచిపోతారు. ఎంత పని ఉన్నా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
* ఈసినిమాకి డబ్బింగ్ చెప్పారా?
– డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నాను. కానీ ఎందుకనో నిర్మాతలు వద్దన్నారు. సమ్మోహనం సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను కదా! ఇక ముందు నా పాత్రలకు నా గొంతే వినిపించాలనుకుంటున్నా.
* వరుణ్‌తేజ్ తో కలసి నటించడం ఎలా అనిపించింది?
– సెట్స్‌లో చాలా ఫన్ ఉండేది. ఏ సన్నివేశం ఎలా చేయాలో ముందుగా మాట్లాడుకునేవాళ్లం. వరుణ్‌తేజ్ చాలా మంచి నటుడు. తన కథల ఎంపిక చాలా బాగుంటుంది.
* చిత్రసీమలో ఆడవాళ్లకు రక్షణ ఉందంటారా?
– ప్రతి ఒక్కరూ వారి రక్షణను వారే చూసుకోవాలి. మనల్ని బట్టే ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. నా విషయానికి వస్తే.. 99 శాతం చాలా మంచి వ్యక్తులతో కలిసి పనిచేశాను. మీ టూ ఉద్యమంలో స్త్రీల మార్పు కోసం బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ సమానత్వాన్ని నమ్మాలి.