చదవడానికి, వినడానికి వింతగా వుందనుకున్నా… యంగ్ హీరో అడివి శేష్ అదే మాట చెప్పాడు! 50 సినిమాలను వదిలేసుకున్నా అని! ‘కర్మ’ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా, దర్శకుడిగా ఇతను అడుగుపెట్టాడు. కానీ, అదృష్టం కలిసిరాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. ‘పంజా’, ‘బలుపు’ సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్స్, ‘రన్ రాజా రన్’తో పాటు కొన్ని సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాడు. మళ్లీ ‘క్షణం’తో హీరోగా మారాడు. హిట్ వచ్చింది. దాంతో పాటు కొత్తగా చేశారని పేరొచ్చింది. ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, హీరోగా నెక్స్ట్ సినిమా చేయడానికి శేష్ చాలా టైమ్ తీసుకున్నాడు. శుక్రవారం ‘గూఢచారి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎందుకింత లేట్ చేశారు? అని అడిగితే… “నాకు ‘క్షణం’ విడుదలైన తరువాత సుమారు 50 సినిమా ఆఫర్లు వచ్చాయి. ఏవీ నచ్చలేదు. అందుకే వదిలేసుకున్నా. ఒక పెద్ద నిర్మాత అయితే నాపై కోపడ్డారు కూడా. కానీ, కథ ముఖ్యం కదండీ” అన్నాడు. గచ్చిబౌలి కుర్రాడు ‘రా’ ఏజెంట్ ఎలా అయ్యాడనే కథతో ‘గూఢచారి’ సినిమా తెరకెక్కిందని చెప్పాడు. ఈ కథ, సినిమా కూడా ‘క్షణం’ తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేశాడు.