ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఈ సారి కొంత విభిన్న వాతావరణం కనిపిస్తున్నది. వాయిదా తీర్మానాలతో అసలు సమావేశాలలో చర్చలే జరక్కుండా పోతే తమకే నష్టమని వైసీపీ గ్రహించి ప్రశ్నోత్తరాలలో పాల్గొనడం మొదటి మార్పు. ఈ సమయంలోనూ విమర్శలు ఆరోపణలు ఎలాగూ వస్తున్నాయి. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంపై ఏం జరుగుతుందన్నదే మొదటి నుంచి ఆసక్తికరంగా వున్న వ్యవహారం. శాసనసభ నేపథ్యంలోనే సాక్షి ఈ కథనాలు సవివరంగా ప్రచురించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులూ నాయకులూ కూడా తీవ్రంగానే స్పందించారు. కొందరు సాక్షిపై కేసులు కూడా పెట్టారు. అయితే కాల్‌మనీ అయినా మరొకటి అయినా ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి ఏకపక్షంగా ముందే ఖండించవలసిన అవసరమేముందని నేను ఒకటికి రెండు సార్లు చర్చలలో ప్రశ్నించాను.
ఈ రోజు శాసనసభలో చంద్రబాబు నాయుడు జగన్ ఆరోపణలకు సాక్ష్యాలు సమర్పించవలసిందిగా కోరి వ్యూహాత్మకంగా ఆత్మరక్షణలో పడేశారు. అంతేగాక ఈ విషయమై సాక్ష్యాలు చూపలేకపోతే క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతే ఇతర అంశాలు తీసుకోవాలని సభా నాయకుడుగా గట్టిగా మాట్లాడారు. ఆయన దన్ను చూసుకుని తర్వాత ఇతర మంత్రులు దాడి బృంద సభ్యులు వరుసగా రంగంలోకి దిగారు. ఇంతవరకూ బాగానే వుంది గాని మొదట ఆరోపణలు చేసిన జగన్ తర్వాత అంతే దీటుగా కొనసాగించినట్టు కనిపించదు. సిబిఐ విచారణ జరపాలన్న కోర్కెకే ఆయన పరిమితమైనారు. పదే పదే అదే అడిగారు. అంతేగాని తాను సాక్ష్యాధార పత్రాలు సభకు సమర్పించలేకపోవడంలో తర్కం ఏమిటో చెప్పలేకపోయారు. నిజానికి సాక్షి కథనాల్లో మంత్రులకు సంబంధించిన వారుకొనుగోలు చేశారన్న వరకూ కొంత చూపించగలిగారు గాని వారు బినామీలని చెప్పడానికి ఉపయోగపడే ఆధారం ఒకటైనా సంపాదించలేకపోయారు. ఈ బలహీనతే జగన్ వాదనలోనూ వుంది. పైగా దాన్ని వ్యూహాత్మకంగా వాదించేందుకు అవసరమైన సన్నాహాలుకూడా ఆయన చేసుకున్నట్టు లేదు.
అయితే ప్రభుత్వం కూడా దీన్ని తెగేదాకా లాగకపోవడం విశేషం. దాని తర్వాతే మరో చర్చ తీసుకోవాలన్న ముఖ్యమంత్రి తేలిగ్గానే వదలిపెట్టేశారు. చర్చ ముగిసిందనే తీర్మానంప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ ఒక పరిధికి మించి చర్చ జరగడం ఏలినవారికి కూడా ఇష్టం లేదన్న మాట. తీగలాగితే కదిలే డొంకల గురించి ఇరు పక్షాలకూ జంకు వున్నట్టు కనిపించింది. ఈ మధ్యలో స్పీకర్‌తో సహా ప్రభుత్వ ప్రతినిధులందరూ సిబిఐ దర్యాప్తు వల్ల రాజధాని ప్రతిష్టకు భంగం అని వాదించడం చెల్లుబాటయ్యేది కాదు. రేపు ఇంతకంటే తీవ్రమైన సమస్య రావచ్చు. ఇక్కడ ప్రతిష్టకు పాకులాడటం కన్నా సత్యాన్ని న్యాయాన్ని ప్రతిష్టించడం ముఖ్యం. ఆధారాలు చూపిస్తే మంత్రివర్గం నుంచి తొలగిస్తానని ముఖ్యమంత్రి ఒకటికి రెండు సార్లు చెప్పడం మాత్రం విశేషమే. సభా సంప్రదాయం ప్రకారం జగన్ వున్న ఆధారాలు ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తారా అన్నది ప్రశ్న.ఒకవేళ ఈ ప్రభుత్వంపైన విశ్వాసం లేదనుకుంటే నిష్పాక్షిన నిపుణులకైనా వాటిని సమర్పించి నిజానిజాలు నిర్ధారించవచ్చు. ఇవేవీ లేకుండా అయితే సిబిఐ లేకుంటే లేదు అన్న వైఖరి తీసుకుంటే ఒరిగేది వుండదు. ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ నష్టం అనుకుంటే మరో ప్రత్యామ్నాయ విశ్వసనీయ పద్దతిలో అక్రమాలను పరిశోధించాలి గాని ముందస్తుగా కితాబులిచ్చేసి కేసు మూసేస్తే సరిపోదు. అయితే ఈ రోజు సవాళ్లు సర్దుబాట్ల తతంగం చూస్తే షరా మామూలుగా ఈ కథ ముగిసినట్టే అనిపిస్తుంది.