ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతీ దేశం..ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర్నుంచి గ్రామ పంచాయతీ వరకూ కరోనా వైరస్ బారి నుండి తమ ప్రజల్ని రక్షించుకునే ఒకే ఒక్క లక్ష్యంతో పని చేస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం..” వస్తుంది..పోతుంది..” అన్న నమ్మకంతో ఉన్న ప్రభుత్వం.. తమ దీర్ఘ కాలిక రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతోంది. రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ.. కొత్త తరహా ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తోంది.
సీఎస్ నుంచి ఎస్ఈసీ వరకూ .. ఎవరికీ గ్యారంటీ ఇవ్వని పాలన..!
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికారయంత్రాంగం కదలిక లేని స్థితికి చేరుకుంది. నిబంధనలకు అనుకూలమా.. వ్యతిరేకమా.. అన్నది మొదటి ప్రయారిటీ కాదు.. ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు చేయాల్సిందే.. లేకపోతే శంకరగిరి మాన్యాలే. ప్రభుత్వం మారగానే చాలా మంది అధికారులకు అలాంటి దుస్థితి కలిగింది. ప్రభుత్వంలో కీలక పదవులు పొందిన వారికి తరవాత ఆ పరిస్థితి వస్తూనే ఉంది. సాక్షాత్తూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. తన సివిల్ సర్వీస్ కెరీర్‌ను అంత దారుణ పరాభవంతో ముగిస్తారని అనుకుని ఉండరు. ఆయనను ఎందుకు తొలగించారో.. ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ తర్వాత అడపాదడపా అధికారులను రాత్రికి రాత్రి.. జీఏడీకి అటాచ్ చేయడాలు… తొలగించడాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే..ఇటీవలి కాలంలో.. నర్సీపట్నం డాక్టర్ .. నగరి మున్సిపల్ కమిషనర్లు అలా మాస్కులు లేవని అసంతృప్తి వ్యక్తం చేయగానే ఇలా సస్పెన్షన్ ఆర్డర్స్ చేతిలో పెట్టేశారు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికీ తప్పని వేటు..!,/span>
ప్రభుత్వం చెప్పినట్లు చేస్తేనే ఉద్యోగం లేకపోతే.. ఊస్టింగే అన్న సందేశం బలంగా పంపేశారు. చివరికి రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా.. వదలకపోవడం.. దేశం మొత్తం చర్చనీయాంశమవుతోంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించేందుకు రాజ్యాంగ నిబంధనలు.. లాంటివేమీ పట్టించుకోకుండా ఆర్డినెన్స్ జారీ చేసేశారు. ఆ తర్వాత లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి.. మరీ ఎప్పుడో పధ్నాలుగేళ్ల కిందట రిటైరైన 75 ఏళ్ల వయసున్న ఓ మాజీ న్యాయమూర్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చో బెట్టేశారు. పాత నిబంధనల ప్రకారం.. ఎస్ఈసీ రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు మాత్రమే. ఇప్పటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ను ఓ జీవో ద్వారా తొలగించిన ఘటన దేశ చరిత్రలో లేదు. రాజ్యాంగబద్ధమైన ఎస్ఈసీని తొలగించాలంటే.. రాజ్యాంగ పరమైన ప్రక్రియ ఉంటుంది. కానీ ప్రభుత్వం.. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించాలనే లక్ష్యంతో.. కోర్టుకు వరుస సెలవులు చూసుకుని పని పూర్తి చేసేశారు. అసలు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ గతంలో రాజ్యాంగం ప్రకారం నియామకం పొందిన వారికి వర్తించదనేది.. ప్రాథమిక న్యాయసూత్రాలు తెలిసిన వారు చెప్పేమాట. కానీ ఏపీ సర్కార్ లక్ష్యం వేరే కాబట్టి… అవన్నీ వినిపించుకునే పరిస్థితి లేదు. చేయాలనుకున్నది చేసేసింది.
రాజ్యాంగ వ్యవస్థల్నీ.. కోర్టుల్ని లెక్క చేయని ప్రజాస్వామ్యం..!
ప్రజలు 151 సీట్లు ఇచ్చారంటే.. దానర్థం.. రాజ్యాంగాన్ని మించీ అధికారాలు చెలాయించమని కానే కాదు. రాజ్యాంగం ప్రకారం అధికారం దక్కించుకున్నారు కాబట్టి.. రాజ్యాంగం ప్రకారమే… పాలన చేయాలి. రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే.. మొదటికే మోసం వస్తుంది. ఎప్పుడు ఏ వ్యవస్థల్నైతే కూల్చేస్తున్నారో ఆ వ్యవస్థలే తర్వాత శాపాలుగా మారొచ్చు. చరిత్రలో ఇలాంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. తాత్కాలికంగా లాభం పొందుతారేమో కానీ.. అంతిమంగా మాత్రం నష్టపోతారు. అయితే.. ఎక్కువగా నష్టపోయేది ప్రజలే.