సూపర్ స్టార్ అని కోట్లాది మంది అభిమానులు వేలం వెర్రిగా రజనీకాంత్ సినిమాలు చూస్తారు. ఆయన్ని దేవుడిలా ఆరాధిస్తారు. ఆయన సినిమా వస్తే పండుగ చేసుకుంటారు. కబాలి సినిమా విషయంలో అదే జరిగింది. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇంత జరిగినా… ఓ వ్యక్తి మాత్రం, రజనీకాంత్ తో ఈ సినిమాలో చేయించిన విన్యాసాలు తనకు జుగుప్స కలిగించాయంటూ పోలీసులకు పిర్యాదు చేశాడు.
అదేదో వేరే ఊళ్లో కాదు. రజనీకి దాదాపు అందరూ అభిమానులే అని భావించే చెన్నైలోనే ఈ సంఘన జరిగింది. వడపళని కి చెందిన కందస్వామి అనే 66 ఏళ్ల వ్యక్తి రజనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబాలి సినిమా హైప్, ప్రచారానికి మోసపోయాననేది అతడి ఫిర్యాదు సారాంశం. మీడియాలో విపరీతంగా హైప్ చేయడం వల్ల తాను 1200 రూపాయలకు పెట్టి చెన్నైలో సినిమా చూశానన్నాడు. తీరా ఆ సినిమా దారుణంగా ఉందట.
ఇంచుమించు తన వయసున్న రజనీకాంత్ అనే వృద్ధుడి చేత ఈ సినిమాలో విచిత్రమైన విన్యాసాలు చేయించారని అవి చూసి తనకు జుగుప్స కలిగిందని పేర్కొన్నాడు. రజనీ కాంత్ వయసు 65 ఏళ్లు. రజనీకాంత్ తో పాటు ఆ సినిమా దర్శక నిర్మాతలు తనను మోసం చేశాడని ఆరోపించాడు. ప్రజల కోసం తమిళనాడు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా, రజనీని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకోండని కోరుతున్నాడు.
తనలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ రజనీ సినిమాలను చూసి మోసపోవద్దంటే అతడికి ఓల్డ్ ఏజ్ హోంలో శాశ్వతంగా ఉంచడమే మార్గమంటున్నాడు కందస్వామి. వృద్ధుడైన రజనీచేత విచిత్రమైన ఫైట్లు, ఫీట్లు చేయించడం జుగుప్సాకరంగా ఉందనే అతడి వ్యాఖ్యకు చాలా మంది ఆశ్చర్యపోయారు. అతడి వాదన కరెక్ట్ అనే వారూ ఉన్నారు.