వైసీపీ ఎమ్మెల్యేలు తమ పాలన ఘోరమని.. జగన్ తీరు అత్యంత ఘోరంగా ఉందని ఒకరి తరువాత ఒకరు ఒప్పుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇదే చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్న మాట వాస్తవమేనని దీనికి కారణం జగన్కు అనుభవం లేకపోవడమేనన్నారు. ఎమ్మెల్యేలతో ఎలా వుండాలన్న దానిపై జగన్ అనుభవం లేదంటున్నారు. అయితే రెండోసారి సీఎంగా అవకాశమిస్తే జగన్కు పూర్తి అవగాహన వస్తుందని సాయిప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. సాయి ప్రసాద్ మాటలు వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ పనితీరు నాసిరకంగా ఉందని… అంతా నాశనం చేశారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో జగన్ కు అనుభవం లేనందునే ఇలా జరిగిందని.. మరోసారి చాన్సిస్తే అనుభవంతో బాగా పరిపాలిస్తామని ప్రచారం చేసుకోవాలన్న వ్యూహతో ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే అనుభవం లేకనే రాష్ట్రాన్ని కూడా నాశనం చేశారని ఇక మరో అవకాశం ప్రజలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో నేర్చుకోని ఇక తర్వాత నేర్చుకుంటారని సహజంగానే ప్రశ్నలు వస్తూంటాయి.
ఎమ్మెల్యేలతో ఎలా ఉండాలి.. ప్రజలతో ఎలా ఉండాలన్నది అనుభవంతో వచ్చేది కాదని.. మనస్థత్వాన్ని బట్టి ఉంటుందని వైసీపీలోనే చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల అవసరం ఉన్నప్పుడు వారిని బాగా చూసుకుని అవసరం లేనప్పుడు కనీసం పట్టించుకోని వ్యక్తిత్వాలకు అనుభవంతో ఏం పని ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కారణం ఏదైనా ఎమ్మెల్యేలు మాత్రం తమ పనైపోయిందని.. అంతా జగన్ వల్లేనని పరోక్షంగా బయటకే చెబుతున్నారు.