హైదరాబాద్: నూనె, నెయ్యి, పాలు, కందిపప్పు, గసగసాలు, మిరియాలు వగైరా మసాలా దినుసులు, పసుపు, కారం వంటి పదార్థాలకు నకిలీలు చేస్తున్నట్లు హైదరాబాద్, విజయవాడ నగరాలలో బయటపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చాక్లెట్లు, సాస్‌లు కూడా నకిలీవి చేస్తున్నట్లు బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ చాక్లెట్లు, సాస్‌లు తయారుచేస్తున్న కేంద్రాలను పోలీసులు పట్టుకున్నారు.
పిల్లలు తినే చాక్లెట్ల తయారీలో నిషేధిత రసాయనాలు, కృత్రిమ పదార్థాలు వినియోగిస్తున్న పరిశ్రమ గుట్టును పాతబస్తీ పోలీసులు రట్టుచేశారు. ఎస్ఏ ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న పరిశ్రమలో కల్తీ గుట్టును పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పాతబస్తీలో తనిఖీలు చేస్తుండగా ఈ వ్యవహారం బయటపడింది. సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి ఈ చాక్లెట్ల పరిశ్రమను నడుపుతున్నాడు. కచ్చా ఇమ్లి, కచ్చా ఆమ్ పేర్లతో చాక్లెట్లు తయారుచేస్తున్నాడు. వీటి తయారీకోసం సహజసిద్ధమైన చింతపండు, మామిడికాయలు ఉపయోగించకుండా అధిక మోతాదులో నిషేధిత రసాయనాలు, కృత్రిమ పదార్థాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోజుకు 100 నుంచి 500 కిలోల చాక్లెట్లు ఈ పరిశ్రమనుంచి బేగంపేట హోల్‌సేల్ వ్యాపారులకు సరఫరా అవుతున్నాయి. పోలీసులు ఈ చాక్లెట్లలో వాడే పదార్థాల నమూనాలను సేకరించి ఫుడ్ కంట్రోల్ అధికారులకు, జీహెచ్ఎంసీ ఫుడ్ ఇనస్పెక్టర్లకు, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ మూడు సంస్థల నివేదిక ఆధారంగా ఈ పరిశ్రమపై చర్యలు తీసుకోనున్నారు.
మరోవైపు జల్పల్లి చెరువు సమీపంలోన ఓ కంపెనీపై దాడిచేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు మినార్ బ్రాండ్ పేరుతో పెద్ద ఎత్తున తయారుచేస్తున్న కల్తీ సాస్‌లను, ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ కంపెనీపై దాడి చేశారు. 833 కల్తీ సాస్ బాటిళ్ళు, 390 కిలోల ఆలుగడ్డ, 360 కిలోల కచ్చా మెటీరియల్, 160 కిలోల రెడ్ మిర్చీ, 360 కిలోల గ్రీన్ మిర్చి, అరకిలో సోడియం, రెండు మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు ఆసిఫ్ అలీ, ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.