భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశంలో పాతుకుపోవడానికి కారణం అయిన అద్వానీ ప్రధాని కావాలనుకున్నారు. కానీ ఉప ప్రధాని మాత్రమే అవగలిగారు. ఆయన రాజకీయ జీవితానికి బలవంతమైన ముగింపు ఇస్తున్నప్పుడు దేశ అత్యున్నత పీఠం అందుకోవాలనుకున్నారు. రాష్ట్రపతి అవ్వాలనుకున్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు అద్వానీ పేరు జోరుగా వినిపించింది. ఆయనకు ఆ పదవి ఇవ్వడం.. బీజేపీ తమ పెద్దలను గౌరవించడమే అనుకున్నారు. కానీ మోదీ, షాలు అలా అనుకోలేదు. అద్వానీని పరిగణనలోకి తీసుకోలేదు.
ఎవరికీ పెద్దగా తెలియని రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశారు. దీంతో అద్వానీ రాజకీయాల నుంచి అంతర్థానం అయిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి వెంకయ్యనాయుడిది. చురుగ్గా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆయనను హఠాత్తుగా ఉపరాష్ట్రపతిగా పంపేశారు. దాంతో ఆయన గొంతు మూగబోయింది. ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి పదవి ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఆయనది జీవితాంతం ఆరెస్సెస్, బీజేపీకి కట్టుబడ్డ వాదం. ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన పూర్తి స్థాయిలో తమ పార్టీ విధానానికి అనుగుణంగానే పని చేశారు. అయితే..ఆయన మోదీ , షాలను మెప్పించలేకపోయారు. అద్వానీ తరహాలోనే ఆయనకూ రిటైర్మెంట్ ఇచ్చేసిటన్లయింది.
రాష్ట్రపతి పదవి అంటే రాజ్యాంగ పరంగా అత్యంత కీలకమైనది. దేశాన్ని స్థిరంగా ఉంచడంలో ఆ పాత్ర కీలకం. ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే వ్యవహరించాల్సిన సందర్భం అత్యంత కీలకం. ప్రపంచదేశాల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందో తేల్చాల్సిన పరిస్థితులు ఎర్పడొచ్చు. అందుకే రాష్ట్రపతులుగా ఉద్దంఢులను నియమించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సారి గిరిజన మహిళలకు మోదీ, షా అవకాశం కల్పిస్తున్నారు. రామ్ నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములలకు అవకాశం కల్పించడం ద్వారా మోదీ, షాలు సామాజిక వర్గ పరంగా న్యాయం చేశారు. కానీ తమ పార్టీ.. తమ ఎదుగుదలకు కారణమైన వారికి మాత్రం అన్యాయం చేశారనే వాదన వినిపిస్తోంది.