బీజేపీ కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానీ అవకాశం చిక్కినపుడల్లా ప్రధాని నరేంద్ర మోడికి చురకలు వేస్తూనే ఉంటారు. కానీ ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన మోడీకి చిన్న చురక వేస్తూనే మళ్ళీ మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా వెనకేసుకు వచ్చేరు.
ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా డిల్లీలో తన నివాసంలో మువ్వన్నెల జెండా ఎగురవేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మనం బ్రిటిష్ వారితో అనేక ఏళ్లపాటు పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకొన్నాము. కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే దేశంలో భావస్వేచ్చకు భంగం కలిగిపోతోందని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ మా ప్రభుత్వం వలననే మన భావ స్వేచ్చకు భంగం కలుగుతున్నట్లయితే అప్పుడు తప్పకుండా అందరూ కలిసి గట్టిగా పోరాడుతారు. కానీ దేశంలో ఎక్కడా అటువంటి పరిస్థితి లేదు. దేశంలో ఏదో అనర్ధం జరిగిపోతోందనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు,” అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా అమిత్ షా మళ్ళీ ఎన్నికయిన తరువాత ఆయనింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోన్నందున బహుశః కొంచెం ప్రసన్నం అయ్యేరేమో?
అద్వానీ దేశ ప్రజలందరికీ ఈ రోజు ఒక మంచి సందేశం ఇచ్చేరు. “సాధారణంగా ఆగస్ట్ 15, గణతంత్రదినం వంటి రోజులలో దేశ ప్రజలలో దేశభక్తి పొంగిపొరలుతుంటుంది. అది చాలా సహజమే. కానీ అటువంటి భావన నిత్యం వారి చేతలలో కనిపించాలి. ప్రస్తుతం విద్య మరియు క్రీడా రంగాలలో అది చాలా ప్రస్పుటంగా కనబడుతోంది. మిగిలిన అన్ని రంగాలలో కూడా జాతీయ భావన, దేశభక్తిని కలిగి ఉండాలి. దేశ ప్రజలు అందరూ ఎల్లప్పుడూ కూడా జాతీయ భావన కలిగి ఉండాలి,” అని అన్నారు.