ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం.. రాజధాని తరలింపు వివాద పిటిషన్లపై జరిగిన వాదనల్లో కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. న్యాయమూర్తులను.. హైకోర్టుకు…దురుద్దేశాలు ఆపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు ప్రయత్నించారని… పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మానసం దృష్టికి తీసుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. దానికి సంబంధించి ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. అమరావతిలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా స్థలాలు ఉన్నాయని… నారా వారి పల్లెలో ఏర్పాటు చేసిన సభలో… సలహాదారులు కల్లాం అజేయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎవరెవరికి ఉన్నాయో చెప్పలేదు కానీ… అసలు న్యాయమూర్తుల ప్రస్తావన తీసుకు రావడమే అనూహ్యం.
అమరావతిలో స్థలాలు, పొలాలు ఉన్న వారంతా దొంగలు, దోపిడీదారులన్నంత .. ఘోరంగా… ప్రభుత్వ పెద్దలు ఇటీవలి కాలంలో మాట్లాడుతున్నారు.ఈ కోణంలోనే.. న్యాయమూర్తుల ప్రస్తావన తీసుకొచ్చి.. వారికీ భూములున్నాయని చెప్పడం ద్వారా.. ఓ బ్లాక్ మెయిల్ సందేశాన్ని.. న్యాయవ్యవస్థకు పంపారన్న అభిప్రాయాన్ని న్యాయవాద వర్గాలు వినిపిస్తున్నాయి. అదే అంశాన్ని.. పిటిషనర్ల తరపు లాయర్ కోర్టుకు విన్నవించారు. న్యాయవ్యవస్థపై నిందలు వేయడానికి కూడా.. వెనుకాడటం లేదనే విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. హైకోర్టును కూడా ప్రభావితం చేస్తున్నారని …సలహాదారులు చేస్తున్న ప్రచారాన్ని కూడా.. లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
నిజానికి లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన విషయాలు.. న్యాయవాద వర్గాల్లో చాలా రోజులుగా చర్చల్లో ఉన్నాయి. తమకు అనుకూలంగా తీర్పు వస్తే సరే.. లేకపోతే.. చంద్రబాబుతో కుమ్మక్కయ్యారన్న ప్రచారాన్ని చేస్తామని… అధికార పార్టీ నేతలు.. పరోక్షంగా చెప్పడమే.. ఆ ప్రకటనల్లోని ఉద్దేశం అంటున్నారు. సలహాదారులు ఈ విషయంలో మరింత ముందుకెళ్లిపోయారేనే భావన వ్యక్తమవుతోంది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..!