ఏపీలో సలహాదారులు ఎంత మంది ఉన్నారంటే ఠక్కున సీఎం జగన్ కూడా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఆయనకే తెలిసి ఉండరు. చివరికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు గోదావరి జిల్లాలకు చెందిన ఓ చోటా జనసేన నేతను చేర్చుకుని సలహాదారు పదవి ఇచ్చేశారు. మరి వీరంతా ఏం చేస్తున్నారంటే… అచ్చంగా రాజకీయమే చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా వారికి అడ్డూ అదుపూ లేదు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.
సలహాదారులందరిలోకి చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మిగతా అందరికీ సలహాదారు పదవులు ఇప్పించేది కూడా ఆయనే. ఆయన చేస్తున్నదే రాజకీయం. వైసీపీ అభ్యర్థుల ప్రకటన దగ్గర్నుంచి వైసీపీ వ్యవహారాలన్నీ చక్క బెడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ.. బీజేపీని విమర్శిస్తున్నారు. చివరికి ప్రధాని మోదీ సభపైనా కామెంట్లు చేశారు. కానీ ఆయన కు ఏ రూల్స్ వర్తించడం లేదు. ఇతర సలహాదారుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగుల్ని బెదిరించో.. బామాలో దారిలో పెట్టుకోవడానికి మాజీ ఉద్యోగ సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చారు. ఆయన కూడా అదే పని చేస్తున్నారు. తమకు ఎదురు లేదన్నట్లుగా సీఈవో ఆఫీస్ ఎదుటే ప్రెస్ మీట్ పెట్టి విపక్షాలను తిట్టారు.
సాధారణంగా సలహాదారులు ప్రభుత్వ జీతం అంటే ప్రజా ధనాన్ని జీతంగా తీసుకుంటున్నారు. వారికి కోడ్ వర్తిస్తుంది. వారు నిబంధనలు ఉల్లంఘించిన వెంటనే చర్యలు తీసుకోకపోతే .. కనీసం ఫిర్యాదు వచ్చినప్పుడైనా ఈసీ స్పందించాల్సి ఉంది. కానీ ఈ సలహాదారులపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా ఇంకా స్పందించలేదు. వారికి ప్రత్యేకమైన కోడ్ మినహాయింపు ఉందేమో ?