వచ్చే శుక్రవారం పోలీసులకు చేతినిండా పని. ఐశ్వర్యా రాయ్ నటించిన యే దిల్ హై ముష్కిల్ విడుదలయ్యే థియేటర్లకు రక్షణ కల్పించడం అనే అదనపు బాధ్యత పోలీసులపై పడింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారు. యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీ కళాకారులు నటించిన సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఆ రోజు ఏం చేస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.
దర్శక నిర్మాత కరణ్ జోహార్ రూపొందించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ పాత్రల్లోనటించారు. ఫవాద్ ఖాన్ అనే పాకిస్తానీ నటుడు కూడా ఇందులో నటించాడు. దీంతో ఈ సినిమాను ప్రద్శించ వద్దని ఎం ఎన్ ఎస్ ఆందోళన చేస్తోంది. సింగిల్ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ లలో కూడా విడుదల చేయవద్దని కార్యకర్తలు సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
దీంతో బాలీవుడ్ నిర్మాతలు పలువురు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ సినిమాకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో గట్టి భద్రత ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు నిర్మాతలు తెలిపారు.
మరోవైపు, ఎం ఎన్ ఎస్ తన పని తాను చేసుకుపోతోంది. ముంబై తోపాటు నాగ్ పూర్ తదితర నగరాల్లోనూ మల్టీప్లెక్స్ యజమానులకు వినతిపత్రాలు ఇవ్వడం కొనసాగిస్తోంది. తమ మాట వినకపోతే విధ్వంసం తప్పదని వాళ్లెవరూ అనడం లేదు. కానీ ప్రస్తుత వాతావరణాన్ని బట్టి అదే జరిగే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎం ఎన్ ఎస్ పిలుపుపై భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. పాకిస్తాన్ కు వీలైనన్ని విధాలుగా నిరసన తెలపాలని, బుద్ధి చెప్పాలని కొందరు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో దేశభక్తి పూరిత సందేశాలు వెల్లువెత్తాయి. మరికొందరు మాత్రం ఇది మంచిది కాదని వాదిస్తున్నారు. భారతీయులు తీసిన సినిమాలను నిషేధిస్తే నష్టపోయేది మనవాళ్లేనంటున్నారు.
మొత్తానికి వివాదం పుణ్యమా అని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో చాలా మంది థియేటర్ల ముందు పహారా కాస్తారు. దేశంలో కొన్ని వేల థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుంది. అంటే వేలాది మంది పోలీసులకు ఈ స్పెషల్ డ్యూటీ తప్పదన్న మాట. అలా ఒక్కరోజు సరిపోతుందా, కొన్ని రోజులు కొనసాగుతుందా అనేది అప్పుడే చెప్పలేం. పోలీస్ రక్షణ ఉన్నా విధ్వంసాలు జరగవచ్చనే ఆందోళన మాత్రం థియేటర్ల యజమానులను వెంటాడుతోంది.