టీ 20 ప్రపంచకప్‌లో మెల్లమెల్లగా సంచలనాలు మొదలవుతున్నాయి. చిన్న జట్లు టోర్నీ ఫేవరెట్లకు షాక్ ఇస్తున్నాయి. టీ 20లో పసికూన అమెరికా.. పాక్‌ని మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఈరోజు మరో షాక్ తగిలింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన కివీస్‌ని ఆఫ్గాన్ ఓడించింది. ఈరోజు ఉదయం వెస్టీండీస్‌లోని గయానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ని 84 పరుగుల భారీ తేడాతో ఓడించిన ఆఫ్గాన్ ఈ మెగా టోర్నీలో పాయింట్ల పట్టిక తెరిచింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు రెహ్మతుల్లా (80), ఇబ్రహిం (44) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. కేవలం 75 (15.2 ఓవర్లు) పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫిలిప్స్ చేసిన 18 పరుగులే అత్యధికం. దాన్ని బట్టి కివీస్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవొచ్చు. ఆఫ్గాన్ బౌలర్లలో రషిద్ ఖాన్, ఫారుఖ్ చెరో 4 వికెట్లు దక్కించుకొన్నారు. రెహ్మతుల్లాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.