ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా రాలేదనే సమస్యకు తోడు అమరావతికి రాజధాని హౌదా కూడా చట్టబద్ధంగా అప్పుడే రాదంటున్నారు న్యాయ కోవిదులు.న్యాయ పరిభాషలో చెప్పాలంటే అమరావతి వాస్తవిక (డిఫ్యాక్టో)గా తప్పా చట్టబద్ధమైన (డిజ్యూరే) రాజధానిగా ఉండదని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రకటించింది. ఇది కొత్త విషయం కాకున్నా ఆసక్తికరమైంది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్-5 సబ్ సెక్షన్-1 ప్రకారం పదేళ్లకు మించకుండా హైదరాబాద్ సంయుక్త రాజధానిగా ఉంటుంది. సబ్ సెక్షన్-2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పదేళ్ల కాలం తర్వాతే అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత మాత్రమే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మిగిలిపోతుంది. ఆగస్టు11నాటికి మొత్తం ఎపి పాలనాయంత్రాంగం అమరావతికి తరలిరావాలని ప్రభుత్వం గడువు ప్రకటించినా పూర్తిగా అమలు జరిగే అవకాశం లేదు.
ఒకవేళ జరిగినా అమరావతి అధికారిక రాజధానిగా పరిగణించబడదు. పూర్తి చట్టబద్ధ రాజధాని హౌదా రావాలంటే విభజన చట్టాన్ని సవరించక తప్పదట. ఓటుకు నోటు పరిణామాల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం హడావుడిగా రాజధాని తరలింపు చేపట్టింది. ప్రజల్లో కూడా హైదరాబాద్ గురించిన గతంలోనే ఉద్వేగం సహజంగానే ఇప్పుడు కనిపించడం లేదు. అయితే అన్ని ప్రాంతాల వారూ, తెలుగేతరులూ కూడా హైదరాబాదులో వుంటారు. ీ రాజకీయంగానూ తెలుగుదేశం ప్రభుత్వం చట్టాన్ని ఇప్పటికిప్పుడు మార్చాలని కోరే అవకాశం ఉండదు.సాధ్యమైనంత కాలం తన హక్కు నిలుపుకోవాలనే అనుకుంటుంది. అనేక ఉమ్మడి సంస్థల విభజన కూడా పూర్తి కాలేదు. హైదరాబాద్ నుంచి రాజధానిని మార్చేస్తున్నట్లు ప్రకటిస్తే ఆర్టీసీ సర్వీసులు, విద్యా సంస్థల ప్రవేశాలు వంటివన్నీ మారిపోతాయి. అమరావతి నిర్మాణం మొదటి దశ కూడా ఇప్పట్లో పూర్తవుతుందని ఎవరు అనుకోవడం లేదు. రెండు గ్రామాల స్టార్టప్ క్యాపిటల్‌కే 2019 వరకు పడుతుందని ప్రకటించారు. కనుక వాస్తవిక మార్పులు ఎలా ఉన్నా అనుకున్న ప్రకారమే మరో ఎనిమిదేళ్ల వరకు హైదరాబాద్ చట్టపరమైన సంయుక్త రాజధానిగా కొనసాగడం అనివార్యం అనుకోవాలి. అమరావతి ఆకర్షణ, పెట్టుబడులు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం మరేవైన పద్ధతులు ఆలోచించవలసి ఉంటుంది. ఏతావాతా భాగ్యనగరమే రెండు రాష్ట్రాల రాజ్యాంగ బద్ద రాజధానిగా కొనసాగుతుండొచ్చు.