బుధవారం రోజందా.. దేశం మొత్తం “పైసా” గురించే చర్చ. ఈ రోజుల్లో లక్షలకే విలువ లేదు.. అలాంటిజి ఒక్క సారిగా “పైసా” ట్రెండింగ్స్‌లోకి వచ్చింది. దీనికి కారణం… పెట్రోల్ లీటర్‌పై ఒకే ఒక్క పైసా తగ్గించడం. కర్ణాటక ఎన్నికల సందర్భంగా…. వారం రోజుల పాటు.. పెట్రోల్ ధరలను నియంత్రించిన కేంద్రం ఆ తర్వాత రోజువారీ పెంచుకుంటూ పోయింది. కనీసం రూ. 4పెంచాలన్న పెట్రోలియం కంపెనీల కోరికను పది రోజుల్లో తీర్చుకోమని సూచించింది. దానికి తగ్గట్లుగా కంపెనీలు… గత వారం రోజుల్లో దాదాపుగా రూ. 4 పెంచేశాయి. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరుగుతూనే పోలేదు.మధ్యలో తగ్గాయి కూడా. అయినా పెంచే పనిలోనే పెట్రోలియం కంపెనీలు ఉన్నాయి. ఈ పెరుగుదల పదిహేను రోజుల పాటు సాగింది. నిన్న బ్రేక్ పడింది. పైగా తగ్గింది. ఎంతంటే.. ఒక్క పైసా.. ఒకే ఒక్క పైసా.
ఈ పైసాను తగ్గించడంపై దేశం మొత్తం ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తగ్గింపు పేరుతో తీవ్రంగా అవమానించారని ప్రజలు మండిపడ్డారు. రేట్లు తగ్గించాలని దేశం మొత్తం గగ్గోలు పెడుతూంటే.. వెటకారం చేస్తున్నట్లు కావాలనే.. పైసా తగ్గించి.. ప్రజలను చిన్న చూపు చూశారన్న విమర్శలు కేంద్రం పై ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదే విధమైన ట్వీట్లు చేశారు. సోషల్ మీడియా స్పందన ఓ రేంజ్ లో ఉంది. కేంద్రాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విపరీతంగా జోకులు పేలాయి. “పైసా” ప్రధానిగా మోదీని ట్రోల్ చేయడం ప్రారంభించారు.
కేరళ ప్రభుత్వం మోదీ వ్యవహారాన్ని మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేసింది. కేంద్రం పైసా తగ్గిస్తే.. తాను ప్రజలపై భారాన్ని రూపాయి తగ్గించింది. జూన్ నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని విజయన్ సర్కార్ ప్రకటించింది. కేంద్రం పైసాతో ప్రజలను పరిహాసం చేసిందన్న విషయాన్ని కేరళ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరో వైపు ఈ “పైసా” వ్యవహారం తమ పరువు తీసిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అధికారుల తప్పిదమేనని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర ప్రజలను అవమానించారన్న విషయం బలంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది.