గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించినంత వరకు రిజల్ట్ శుక్రవారం సాయంత్రానికి తేలిపోతుంది. పురానాపూల్ రీపోలింగ్ పూర్తయిన తరువాత.. మొదలయ్యే కౌంటింగ్ కొన్ని గంటల వ్యవధిలోనే తేల్చేస్తుంది. ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు దక్కాయో కేవలం కొన్ని గంటల్లో ఫైనలైజ్ అవుతుంది. అయితే మేయర్ ఎన్నిక మాత్రం జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాన్ని తమ ఇష్టానుసారంగా మార్చేస్తూ.. అధికార తెరాస పార్టీ ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో తమకు అనుకూలంగా అడ్డదారులు సృష్టించుకున్న వైనం ఇప్పుడు హైకోర్టులో విచారణను ఎదుర్కొంటూన్నందు మేయర్ ఎన్నిక జాప్యం అయ్యేలా కనిపిస్తోంది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్పై హైకోర్టులో బుధ, గురువారాల్లో వాదనలు జరిగాయి. నిజానికి ఇలా చట్టాన్ని తమ ఇష్టానుసారంగా కేసీఆర్ సర్కారు మార్చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ కోర్టు వ్యాఖ్యానించిన సంగతి 360 పాఠకులకు తెలుసు. ప్రభుత్వ వాదనల్ని గురువారం వినిపించడానికి ఏజీ సమయం తీసుకున్నప్పటికీ.. ఈరోజు న్యాయపీఠాన్ని తన వాదనతో మెప్పించలేకపోయారు.
విభజన చట్టం ప్రకారం.. శాసనసభకు వెళ్లవలసిన అవసరం లేకుండా జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల వరకు చట్టాలను మార్చుకోవచ్చునంటూ ఏజీ గురువారం నాడు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే రెండేళ్ల వరకు ఎన్నిసార్లయినా చట్టాలు మార్చుకోవచ్చన్నట్లుగా ఆయన వాదన తయారైంది. దీనిపై పిటిషనర్.. విభజన చట్టం ప్రకారం.. ఒకేసారి జీవో ద్వారా చట్టాలు మార్చడానికి వీలుందని.. న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నదంటూ న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. శుక్రవారం సాయంత్రానికి రిజల్ట్ వచ్చినప్పటికీ.. ఎక్స్అఫీషియో సభ్యులకు సంబంధించిన కోర్టు వివాదం మొత్తం ఒక కొలిక్కి వచ్చే వరకు మేయర్ పీఠానికి ఎన్నిక జరిగే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.